భారత్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 ప్రాజెక్ట్‌లోని విక్రమ్ ల్యాండర్‌తో సంబంధాలు పునరుద్ధరణ చేసేవరకు వంతెన దిగనని ప్రకటించిన ఓ యువకుణ్ని ఎట్టకేలకు పోలీసులు కిందకు దించారు. అసలు ఆ కుర్రాడు ఎందుకు ఇంత పట్టుబట్టాడు?
జాబిల్లి ఉపరితలంపై అడుగు మోపడానికి కొన్ని క్షణాల ముందు విక్రమ్ ల్యాండర్‌తో సంబంధాలు తెగిపోవడం... ఉత్తర్‌ప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌కు చెందిన రజనీకాంత్ అనే యువకుడ్ని నిరాశకు గురి చేసింది. విక్రమ్ ల్యాండర్ జాడ తెలిసినప్పటికీ.. సంబంధాల పునరుద్ధరణ జరగడం కష్టమని తెలిసి నిరుత్సాహంతో ఏకంగా చందమామ కోసం శాంతి పూజలను నిర్వహించడం మొదలు పెట్టాడు.
ఇందుకోసం జాతీయ జెండా పట్టుకుని నిర్మాణంలో ఉన్న యమునా నది వంతెన స్తంభం ఎక్కి కూర్చున్నాడు. అక్కడి నుంచి దిగేందుకు నిరాకరించాడు. 3 రోజులుగా పోలీసులు ఆ కుర్రాణ్ని దింపేందుకు విశ్వప్రయత్నం చేశారు. దింపాలని ప్రయత్నిస్తే దూకేస్తానని బెదిరించాడు. అయితే పోలీసులు హ్రైడ్రాలిక్ యంత్రం లేకపోవడం వల్ల అతన్ని కిందకు దించలేకపోయారు.
ఎట్టకేలకు...
3 రోజుల తర్వాత బనారస్ నుంచి తెప్పించిన హైడ్రాలిక్ యంత్రం ద్వారా జవాన్లు, పోలీసులు రజనీకాంత్‌ను కిందకు దించారు. అప్పటికే ఆ యువకుణ్ని చూసేందుకు జనం తండోపతండాలుగా చేరుకున్నారు. ఈ పరిణామంతో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
"అతను ఇంతకుముందు రెండు మూడు సార్లు ఇలానే వంతెన పైకి ఎక్కాడు. 'చంద్రయాన్-2లోని ల్యాండర్ విక్రమ్‌తో సంబంధాలు తెగిపోయాయి... అందుకే ప్రార్థన చేస్తున్నాను 'అని అతను చెప్పాడు. మా దగ్గర హైడ్రాలిక్ యంత్రం లేదు. బనారస్ నుంచి ఈ రోజే వచ్చింది. జవాన్లు చాకచక్యంగా వ్యవహరించడం వల్ల అతడ్ని సురక్షితంగా కిందకు దించగలిగాం."
- పోలీసు అధికారి
ఎందుకు..?
విక్రమ్ ల్యాండర్ జాబిల్లి ఉపరితలం మీద దిగడానికి కొన్ని క్షణాల ముందు గల్లంతు కావడానికి ప్రధాన కారణం.. చందమామ ఆగ్రహమేనని రజనీకాంత్ చెబుతున్నాడు. అందుకే చంద్రుడి కటాక్ష వీక్షణాల కోసం ప్రార్థనలు చేస్తున్నానని వంతెన మీద నుంచి ఓ కాగితంలో రాసి, కిందికి విసిరేశాడు.
సోమవారం రాత్రి 7 గంటల సమయంలో వంతెన ఎక్కి కూర్చున్నాడు రజనీకాంత్. అతను వంతెనపై ఉన్న వీడియోలు వైరల్ అయ్యాయి. అయితే రజనీకాంత్‌కు ఇలా చేయడం కొత్తేమీ కాదట. ఇదివరకు పర్యావరణాన్ని పరిరక్షించాలంటూ అదే స్తంభం పైకెక్కి కూర్చున్నాడని పోలీసులు తెలిపారు.