వారిద్దరూ ఉన్నత విద్యావంతులు. ఒకరు ఐఏఎస్ అధికారి అయితే... మరొకరు వైద్యురాలు. ఈ ఇద్దరికి ఇటీవలే వివాహమైంది. అయితే ఈ పెళ్లికి ముందు ఒక ఆసక్తికర ఒప్పందం జరిగింది. వైద్యురాలిని మాత్రమే పెళ్లి చేసుకుంటానని ముందే నిశ్చయించుకున్న తమిళనాడులోని తిరునెల్వేలి సబ్ కలెక్టర్ శివగురు ప్రభాకరన్.. తన కాబోయే భార్య వారంలో రెండు రోజులు పేదలకు ఉచిత వైద్య సేవలందించాలని షరతు పెట్టారు. అదే తాను వరకట్నంగా కోరుకుంటున్నానని తల్లిదండ్రులకు చెప్పారు.
ఈ నేపథ్యంలో వైద్యురాలైన యువతి కోసం ఇంట్లో పెద్దలు వెతికి, చివరికి చెన్నైకి చెందిన ఓ గణిత అధ్యాపకుడి కుమార్తె డాక్టర్ కృష్ణభారతిని చూశారు. ప్రభాకరన్ కోరిక మేరకు ‘వినూత్న వరకట్నం’ అడిగారు. వారంలో రెండు రోజులు ప్రభాకరన్ స్వగ్రామమైన ఒట్టంకాడు, పరిసర గ్రామాల్లోని ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించాలన్నదే దాని సారాంశం. దీనికి వధువు ఇంటివారు సమ్మతించడం వల్ల ఫిబ్రవరి 26న వీరి పెళ్లి తమిళనాడులోని తంజావూరు జిల్లాలో జరిగింది.
ప్రభాకరన్ తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు. ప్రభాకరన్ తొలుత రైల్వేలో ఉద్యోగం చేశారు. అనంతరం పట్టుదలతో ఐఏఎస్ సాధించారు. ఆయన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పేరిట ‘డాక్టర్ ఏపీజే గ్రామ అభివృద్ధి బృందం’ ఏర్పాటు చేసి పలు రకాల సేవలు అందిస్తున్నారు. ఉచిత వైద్య శిబిరాల నిర్వహణ, శ్రమదానం కింద చెరువుల పూడికతీత వంటి కార్యక్రమాలు చేపడుతున్నారు.
ఇదీ చూడండి: అపాచీకి దీటుగా స్వదేశీ మిలిటరీ హెలికాప్టర్!