మధ్యప్రదేశ్ శాసనసభలో భాజపాకు ఎదురుదెబ్బ తగిలింది. ఓ బిల్లు ఆమోదం సందర్భంగా ఇద్దరు భాజపా ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతుగా ఓటేశారు. ఈ ఘటన తర్వాత భాజపా నుంచి ఇంకా చాలా మంది శాసనసభ్యులు తమతో చేరతారని కాంగ్రెస్ ప్రకటించడం చర్చనీయాంశమైంది. కర్ణాటకలో ‘ఆపరేషన్ కమలం’ విజయవంతమైన వార్తల నడుమ మధ్యప్రదేశ్‌లో ఈ పరిణామం ఆసక్తికరంగా మారింది.
మధ్యప్రదేశ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన శిక్షాస్మృతి చట్ట సవరణ బిల్లు, 2019కి మద్దతుగా భాజపా ఎమ్మెల్యేలు నారాయణ్ త్రిపాఠి, శరద్ కోల్ ఓటు వేశారు. బిల్లుకు అనుకూలంగా 122మంది ఎమ్మెల్యేలు ఓటు వేశారు. 230 సీట్లున్న శాసనసభలో కాంగ్రెస్ పార్టీకి... స్పీకర్‌ను మినహాయించి 120మంది ఎమ్మెల్యేల సొంతం బలం ఉంది.
'కాంగ్రెస్‌కే మా మద్దతు'
భోపాల్ సెంట్రల్ ఎమ్మెల్యే ఆరిఫ్ మసూద్ ద్వారా భాజపా ఎమ్మెల్యేలతో కమల్‌నాథ్ ఒప్పందం కుదిరిందని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. కాంగ్రెస్‌కు మద్దతిచ్చిన ఎమ్మెల్యేల్లో త్రిపాఠి....మైహార్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండగా, శరద్ కోల్..బియోహరి నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇద్దరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు తమ మద్దతును కొనసాగిస్తామని వెల్లడించారు.
కాంగ్రెస్‌లోకి మరింత మంది
మధ్యప్రదేశ్ శాసనసభలో కాంగ్రెస్‌కు సాధారణ మెజారిటీకి రెండు సీట్లు తక్కువగా 114మంది ఎమ్మెల్యేలున్నారు. నలుగురు స్వతంత్ర శాసనసభ్యులు, ఇద్దరు బీఎస్పీ, ఒక ఎస్పీ ఎమ్మెల్యే ప్రభుత్వానికి మద్దతిస్తున్నారు. మరో ఇద్దరు, ముగ్గురు శాసనసభ్యులను పార్టీలో చేర్చుకోవడానికి కాంగ్రెస్ చూస్తున్నట్టు సమాచారం.
"పలువురు భాజపా ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌తో సంప్రదింపులు జరుపుతున్నారు. వచ్చే శాసనసభ సమావేశాల నాటికి వారు కాంగ్రెస్‌లో చేరిపోవచ్చు."
-పీసీ శర్మ, ప్రజా సంబంధాల మంత్రి
ముగింపు మేమిస్తాం: భాజపా
తమ అధినాయకత్వం ఆదేశిస్తే 24 గంటల్లో ప్రభుత్వాన్ని కూలుస్తామని చెబుతున్న భాజపా నేత గోపాల్ భార్గవకు ఇది అనుకోని పరిణామంగానే మిగిలింది. ఆటను కాంగ్రెస్సే ప్రారంభించిందని, కానీ ముగింపు తాము ఇస్తామని భాజపా నేత నరోత్తమ్ మిశ్రా వ్యాఖ్యానించారు.
ఇదీ చూడండి: కూటమి సర్కారు కూలింది.. మరి తర్వాతేంటి?