దేశ రాజధాని దిల్లీ మహానగరాన్ని విషమేఘంలా కమ్మేసిన కాలుష్య ఉద్ధృతిపై సర్వోన్నత న్యాయస్థానం స్పందించిన తీరు మునుపెన్నడూ కనీవినీ ఎరుగనిది. నిర్లక్ష్య పోకడలపై నిప్పులు కక్కిన ధర్మాసనం- దిల్లీ కంటే నరకమే నయమని ఘాటుగా వ్యాఖ్యానించింది. వ్యవసాయ వ్యర్థాలు తగలబెట్టడంపై ‘సరైన చర్యలు లేవు... సంకల్పం అంతకన్నా లేదు’ అంటూ పంజాబ్, హరియాణా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు కోర్టు తలంటేసింది. అంతకంతకు వాయుకశ్మలం విజృంభిస్తున్న దిల్లీలో తాగునీటి కాలుష్య నియంత్రణ, వ్యర్థాల నిర్వహణ సైతం గాడితప్పడాన్ని ఆక్షేపిస్తూ ‘అసలు మనిషి ప్రాణం విలువ ఎంతనుకుంటున్నారు మీరు?’ అని నిగ్గదీసిన కోర్టు ధర్మాగ్రహం- అసంఖ్యాక బాధితుల హృదయావేదనకు ప్రతిధ్వని!
దిల్లీలో ఇటీవల ‘ఆరోగ్య అత్యవసర పరిస్థితి’ ప్రకటించిన కేజ్రీవాల్ సర్కారు, నిర్మాణ కార్యకలాపాలపై ఆంక్షలు విధించింది. తనవంతుగా హరియాణా నిరుడు పంటవ్యర్థాల దహనం జోరుగా సాగిన గ్రామాల్ని గుర్తించి అక్కడ అద్దెకు యంత్రాల పంపిణీ చేపట్టింది. రైతులకు ముట్టజెబుతామన్న ఆర్థిక ప్రోత్సాహకాల మాటేమిటని కేంద్రాన్ని పంజాబ్ ప్రశ్నిస్తోంది. పంట వ్యర్థాల్ని పొలంలో దున్నేయడంవల్ల భూసారం పెరుగుతుందని, పైరుకు ఉపయోగపడే వేల రకాల సూక్ష్మజీవులు హతమారిపోకుండా కాపాడుకోవచ్చునని రైతులకు తెలియజెప్పడంలో అక్కడి ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయి. సత్వర స్పందన కరవైన పర్యవసానంగానే- దిల్లీ, పంజాబ్, హరియాణా, యూపీలు ఇప్పుడిలా ధర్మాసనం చేత గట్టిగా తలంటించుకోవాల్సి వచ్చింది. పంట వ్యర్థాలతో వంటచెరకు, ఇతర ఉత్పత్తుల తయారీ విభాగాలు నెలకొల్పడంతోపాటు దిద్దుబాటు చర్యల్లో రైతుల్నీ భాగస్వాములు చేయడంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇకనైనా చురుగ్గా దృష్టి సారించాలి!
దిల్లీని ఏటేటా ఉక్కిరిబిక్కిరి చేస్తూ విపరీత కాలుష్య కారకమవుతున్న పంటవ్యర్థాల దహనాన్ని నిషేధించాల్సిందేనని జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్‌జీటీ) నాలుగేళ్ల క్రితం నిర్దేశించినా- ఇప్పటికీ ఎక్కడి గొంగడి అక్కడే. ఆంక్షలు అమలుపరుస్తున్నట్లు పంజాబ్, హరియాణాలు చెబుతున్నా- క్షేత్రస్థాయిలో అంతటా ఎప్పటి కథే. టన్నుల కొద్దీ వరి దుబ్బుల్ని యంత్ర పరికరాలతో తొలగించడం తమ తలకు మించిన భారమంటూ పొలాల్లోనే వాటిని రైతులు తగలబెట్టడం ఆనవాయితీగా స్థిరపడింది. పర్యావరణానికి, దేశార్థికానికి తూట్లు పడకుండా నివారించే కృషిలో మొదటి మెట్టుగా కేంద్రం ప్రత్యేక నిధినొకదాన్ని నెలకొల్పాలి. దేశంలో ఏటా పదికోట్ల టన్నుల దాకా పంట వ్యర్థాల్ని తగలబెడుతుండగా- అందులో పంజాబ్, హరియాణా, యూపీలదే సగానికిపైగా వాటా అయినందువల్ల తక్షణ మరమ్మతు చర్యలకు అక్కడే నాంది పలకాలి!
వాయుకాలుష్య సమస్య కేవలం పంటవ్యర్థాల దహనానికో, పెద్దయెత్తున ప్రజానీకం గ్యాస్ ఛాంబర్‌లో అలమటించే దుస్థితి దిల్లీ నగరానికో పరిమితమైనవి కాదు. దిల్లీలో కన్నా అధికంగా యూపీ, మహారాష్ట్ర, బిహార్, పశ్చిమ్ బంగ, రాజస్థాన్లలో వాయు కాలుష్య సంబంధిత మరణాలు సంభవిస్తున్నాయి. జీంద్ (హరియాణా), బాగ్‌పత్, ఘజియాబాద్, హాపుర్, లఖ్‌నవూ, మొరాదాబాద్, నొయిడా, కాన్పూర్, సిర్సా వంటి చోట్ల ఈ నెలలో వాయు నాణ్యత సూచి దిల్లీ కన్నా ఆందోళనకర స్థాయిలో నమోదైంది. దేశం నలుమూలలా కాలుష్య నియంత్రణ మండళ్ల అసమర్థ నిర్వాకాలకు, భ్రష్ట ధోరణులకు అద్దంపడుతూ మూడొంతులకుపైగా నగరాలు, పట్టణాలపై విష ధూమం దట్టంగా పరుచుకుంటోంది. కాలుష్య స్థాయి అత్యంత విషమంగా ఉన్నచోట్ల కశ్మల కారక పరిశ్రమల్ని మూడు నెలల్లోగా మూసేయించాలంటూ సీపీసీబీ (కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి)కి ఎన్‌జీటీ ఇచ్చిన గడువు అక్టోబరులో ముగిసిపోయింది. నేటికీ ఎక్కడికక్కడ నిబంధనల ఉల్లంఘన, దేశంలో మరిన్ని బాధిత దిల్లీల్ని కళ్లకు కడుతోంది!
గణాంకాలు
పోటాపోటీగా పెచ్చరిల్లుతున్న జల, వాయు కాలుష్యాలను అరికట్టలేకపోతే ఆసియా పసిఫిక్ ప్రాంతం కడగండ్ల పాలు కావడం ఖాయమని ఆసియా అభివృద్ధి బ్యాంకు పాతికేళ్లనాడే హెచ్చరించింది. సంవత్సరాల తరబడి అందుకు మన్నన దక్కకపోవడం వల్ల దాపురించిన దుష్ఫలితాలిప్పుడు ఎటు చూసినా గోచరిస్తున్నాయి. రాజస్థాన్, యూపీ, హరియాణా తదితర రాష్ట్రాల్లో వాయు కాలుష్యం మూలాన రెండేళ్లకుపైగా పౌరుల ఆయుర్దాయం తెగ్గోసుకుపోతోంది. దేశవ్యాప్తంగా కలుషిత గాలులు నేటికీ ప్రతి ఎనిమిది చావుల్లో ఒకదానికి కారణమవుతున్నాయి. అంతర్జాతీయంగా వాయు కాలుష్య పద్దు కింద సగటున లక్షమందికి 64 అర్ధాంతర మరణాలు నమోదవుతుండగా, భారత్‌లో ఆ సంఖ్య 134. జాతీయ పరిశుద్ధ వాయు ప్రణాళిక (ఎన్‌క్యాప్) ప్రకారం ఎంపిక చేసిన 102 నగరాల్లో స్థానికావసరాల ప్రాతిపదికన ప్రత్యేక కార్యాచరణ పట్టాలకు ఎక్కనున్నట్లు మొన్న జనవరిలో మోతెక్కిపోయింది. సంబంధిత కేంద్ర మంత్రిత్వశాఖలు, రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు, స్థానిక సంస్థల సంయుక్త పాత్రపోషణతో కాలుష్య వ్యతిరేక పోరు పదును తేలుతుందన్న హామీలు నేడు నీరోడుతున్నాయి.
మూసీ కాలుష్యంపై తెలంగాణ ఉన్నత న్యాయస్థానం, దిల్లీ నరకయాతనపై సుప్రీంకోర్టు తాజా స్పందనలు- దేశమంతటా కశ్మల సంక్షోభ తీవ్రతను ధ్రువీకరిస్తున్నాయి. పారిశ్రామిక సంస్థలకు, వాహన వినియోగదారులకు కచ్చితమైన విధి నిషేధాల అమలుతోనే పొరుగున జనచైనా తెప్పరిల్లింది. పరిశుభ్రతను సంస్కృతిగా అలవరచి పౌర సమాజంలో పర్యావరణ స్పృహ రగిలిస్తున్న దేశాలెన్నో జల, వాయు నాణ్యతలో భేషనిపించుకుంటున్నాయి. కోపెన్‌హేగన్ వంటివి సైకిళ్ల విస్తృత వాడకాన్ని ప్రోత్సహిస్తుండగా- జాంబి(ఇండొనేసియా)లాంటి నగరాలు విరివిగా మొక్కల పెంపకానికి, వ్యర్థాలనుంచి మీథేన్ ఉత్పత్తికి పెద్దపీట వేస్తున్నాయి. ఆయా అనుభవాలనుంచి గుణపాఠాలు నేర్చి, సాంకేతిక పరిజ్ఞానం దన్నుతో కాలుష్యభూతం కోరలు పెరికే చొరవే ఇక్కడా మార్పు తేగలుగుతుంది!
ఇదీ చూడండి : కాంగ్రెస్‌కు స్పీకర్.. ఎన్సీపీ నుంచి ఉప ముఖ్యమంత్రి