కుటుంబ సభ్యుల కోసం నిరంతరం కష్టించే గృహిణుల శ్రమను గుర్తించి గౌరవించే విషయంలో, ఆర్థికంగా దాని విలువను నిర్ధరించటానికి చాలా ఏళ్లుగా అనుసరిస్తున్న విధానంలో మార్పు రావాల్సి ఉందని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా వాహన ప్రమాదాల పరిహారం చెల్లింపు విషయంలో గృహిణుల శ్రమను, కుటుంబ సభ్యులకు వారి సేవల విలువను అంచనా వేయటంలో లోపాలను సరిచేయాల్సి ఉందని తెలిపారు.
వాహన ప్రమాదంలో భార్య, భర్త చనిపోగా వారి పిల్లలకు రూ.40.71లక్షల పరిహారం చెల్లించాలని మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రైబ్యునల్ తీర్పునిచ్చింది. బీమా కంపెనీ ఆ తీర్పును హైకోర్టులో సవాలు చేసింది. బీమా కంపెనీ వాదనలను పాక్షికంగా అంగీకరిస్తూ.. చనిపోయిన గృహిణి భవిష్యత్తు సేవల విలువను కుదిస్తూ పరిహారం మొత్తాన్ని రూ.22లక్షలుగా న్యాయస్థానం ఖరారు చేసింది. ఈ తీర్పుపై మృతుల కుటుంబ సభ్యులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
సర్వోన్నత న్యాయస్థానం పరిహారాన్ని రూ.33.20 లక్షలకు పెంచింది. జస్టిస్ సూర్యకాంత్ రాసిన తీర్పుతో ఏకభవిస్తూనే జస్టిస్ ఎన్.వి.రమణ తన అభిప్రాయాలను విడిగా రాస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగం చేసే వ్యక్తుల భవిష్యత్తు ఆదాయాలను గణించటానికి వారి జీతభత్యాలను ఆధారం చేసుకోవటానికి వీలుంటుంది. అయితే, జీవితాంతం కుటుంబ సభ్యుల కోసమే శ్రమించే గృహిణుల సేవలకు ఖరీదు కట్టడం అసాధ్యమైన విషయమని, అందువల్ల వాటిని విలువలేనివిగా భావించటం తగదని జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. ఇందుకు ప్రత్యేక విధానాలను అనుసరించాలని, మహిళల శ్రమకు సముచిత గౌరవాన్ని, విలువను ఇవ్వాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: కత్తులతో అల్లుడు దాడి.. మామ, మరదలు మృతి