రుణాలు ఇవ్వడం ద్వారా.. వీధి వ్యాపారుల నిజాయితీని, కృషిని తమ ప్రభుత్వం గుర్తించిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. 'పేదల పేరుతో రాజకీయాలు చేస్తున్నవారు... వారికి రుణం ఇస్తే తిరిగి రాదు అనే వాతావరణాన్ని సృష్టించారు' అని ఆయన వ్యాఖ్యానించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రధాన మంత్రి వీధి వ్యాపారుల ఆత్మనిర్భర్ నిధి(పీఎంఎస్‌వీఏ నిధి) పథకం లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోదీ మాట్లాడారు.
'ప్రస్తుతం పేదలు బ్యాంకింగ్ వ్యవస్థతో ముడిపడి ఉన్నారు. సమయానికి అప్పును తిరిగి చెల్లించినవారు.. రుణాలు పొందవచ్చు. రుణాలు ఎగవేసి, మోసాలకు పాల్పడినవారే పేదలపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. దేశంలోని పేదవారు ఎప్పుడూ ఆత్మగౌరవం, నిజాయితీ విషయంలో రాజీపడరు' అని ప్రధాని అన్నారు. ఈ విషయాన్ని ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఓ వీధి వ్యాపారి మరోసారి రుజువు చేసినట్లు ప్రశసించారు మోదీ.
ఆగ్రా, వారణాసి, లఖ్‌నవూల్లోని ముగ్గురు పీఎంఎస్‌వీఏ నిధి లబ్ధిదారులతో ప్రధాని ముచ్చటించారు. ఈ పథకం వారికి ఎలా ఉపయోగపడిందో అడిగి తెలసుకున్నారు. దీని గురించి అందరికీ తెలిజేయాలని వారికి సూచించారు ప్రధాని.
కరోనా మహమ్మారి వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వీధి వ్యాపారులకు ఊతమిచ్చేందుకు ఈ ఏడాది జూన్ 1న పీఎంఎస్‌వీఏ నిధి ప్రారంభించారు. దీనికి 25 లక్షల దరఖాస్తులు అందగా.. 12 లక్షల మందికి రుణం మంజూరు చేశారు. అత్యధికంగా ఉత్తర్‌ప్రదేశ్ నుంచి 6.50 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు ప్రధాని తెలిపారు.
ఇదీ చూడండి: కరోనా వేళ తొలి దశ పోలింగ్‌కు 'బిహార్' సిద్ధం