'వలియ, వలియ, వలియ
రావేలు గలవాడ రార పాలిగాడ'
అని పాడితే రైతు లోకం ఉర్రూతలూగింది. ‘ఎండల్లో, వానల్లో నీడనక నిద్రనక పండిస్తాము సంపదలు (పంటలను) పస్తులుంటాము రోరన్నా! ఉప్పుంటే పప్పు వుందా? ఉండబోతే కొంప వుందా? బ్రతుకంతా వెతలాయె నా చిన్నారి కూలన్నా’ అన్న పాటతో కూలి జనం మమేకమయ్యారు. ‘బండెనక బండి కట్టి ఏ బండ్ల నువ్వొత్తావు నా కొడ్కా జన్నారెడ్డి’ అన్న పాటవిని జనాగ్రహం కట్టలు తెంచుకొనేది. ‘ఏరన్న రాకమునుపె ఎరువాక వచ్చెరన్న’ పాట విని జనం ఊగిపోయేవారు. ఆయన జనం మెచ్చిన కళాకారుడు. జనం భాషలో పాడాడు. జనం కోసం పాడాడు. ఆ జన వాగ్గేయకారుడు షేక్ నాజర్.
హరికథ అనగానే ఆదిభట్ల నారాయణదాసు, జముకుల పాట అంటే సుబ్బారావు పాణిగ్రాహి గుర్తుకొచ్చినట్లు, బురక్రథ అనగానే తెలుగువారికి స్మరించదగ్గ మహనీయ కళాకారుడు నాజర్. ‘బుర్రకథ పితామహుడు’గా తెలుగు జాతి ఆయనను గౌరవించింది.
తెలుగు నాట జానపద, వినోద గాన ప్రక్రియ బుర్రకథ. తెలుగు వారి సాంస్కృతిక జీవనంలో ప్రముఖ స్థానం వహించిన కళారూపం బుర్రకథ. ఒకప్పుడు జంగం కథగా వర్ధిల్లిన కళారూపం. తరవాత తంబూరా కథ, తందాన కథ, గుమ్మెట్ల కథ అనే ప్రాంతీయ భేదాలతో ప్రసిద్ధమైంది. ప్రబోధానికి, ప్రచారానికి సాదనంగా, విస్తృతంగా జనబాహుళ్యంలో ప్రాచుర్యం వహించింది బురక్రథ. తెలుగు ప్రజల హృదయాల్లో గాఢంగా నాటుకుపోయింది. సాహిత్య, సంగీత, నృత్య, అభినయాల సమాహార కళ ఇది. హృదయాన్ని అహ్లాదపరిచే సంగీతం, కంటికింపైన నృత్యం, మనస్సును మురిపించే చమత్కార సంభాషణలతో, పండిత పామర రంజకమైన వినోదం బుర్రకథ. ‘వినరా భారత వీర కుమారా విజయం మనదేరా’ అని కథకుడు పాడుతుంటే జనం అత్యుత్సాహంతో ఆనందించేవారు.
షేక్ నాజర్ గుంటూరు జిల్లా పొన్నెకల్లు గ్రామంలో 1920 ఫిబ్రవరి 5న జన్మించారు. తల్లిదండ్రులు బీబాబ్, షేక్ మస్తాన్. ఆ ప్రాంతంలో చెక్క భజనలో మస్తాన్ గొప్ప కళాకారుడు. నాజర్‌కు బాల్యంలో చదువుపై శ్రద్ధ ఉండేది కాదు. ‘పాటలన్నా, రాగసాయలన్నా అనాడు ఒక్క దఫా వింటే చాలు గుర్తుండేది. కాని ఎక్కాలు, లెక్కలు మాత్రం ఎంత చదివినా గుర్తుండేవి కావు’ అంటారు నాజర్. మంగళగిరిలో మురుగుళ్ల సీతారామయ్య వద్ద హార్మోనియం నేర్చుకున్నారు. ముట్లూరు కోటవీరయ్య అనే హరికథా భాగవతార్ వద్ద శాస్త్రీయ రాగాలు అభ్యసించారు. మొదట్లో నాటకాల్లో స్త్రీ పాత్రలు ధరించారు. పాదుకా పట్టాభిషేకంలో కైకేయి, ఖిల్జీ రాజ్యపతనంలో కమలారాణి, శ్రీకృష్ణరాయబారంలో రుక్మిణి పాత్రలు వేశారు. కమ్యూనిస్టు పార్టీ నాయకుడు వేములపల్లి శ్రీకృష్ణతో పరిచయం ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది. ఆయన ప్రోత్సాహంతో బుర్రకథ దళం ఏర్పడింది. రామకోటి కథకుడు, నాజర్ హాస్యం, పురుషోత్తం రాజకీయ వంతలుగా కథ చెప్పారు. ఆ తరవాత నాజర్ కథకుడయ్యారు. నాజర్ కథకుడిగా మొదటి బుర్రకథ ‘వీరనారి టాన్యా’ తాడికొండలో జరిగింది. రెండవ ప్రపంచ యుద్ధం నాటి రాజకీయ కల్లోల వాతావరణంలో ప్రజా నాట్య మండలి ఏర్పడింది. కళ కళకోసం కాదని, ప్రజల కోసమని ప్రజా నాట్య మండలి భావించింది. గరికపాటి రాజారావు ఆధ్వర్యంలో నాజర్ బుర్రక్రథ కళాకారుడుగా అందులో ప్రవేశించారు. 1940 దశకంలో కమ్యూనిస్టు పార్టీ నెల జీతం మీద కథలు చెప్పించి, పార్టీ ప్రచారానికి నాజర్‌ను ఉపయోగించుకున్నారు.
నాజర్- 'పల్నాటి యుద్ధం, బొబ్బిలి యుద్ధం, అల్లూరి సీతారామరాజు, వీరాభిమన్యు, ప్రహ్లాద, క్రీస్తు, బెంగాల్ కరవు' మొదలైన ఇతివృత్తాలతో సమకాలీన రాజకీయాలు జోడించి బుర్రకథలు రూపొందించారు. బెంగాల్ కరవు బుర్రకథ చూసిన ప్రముఖ నటుడు బళ్లారి రాఘవ దుఃఖం ఆపుకోలేక నాజర్‌ను కౌగిలించుకొని విలపించారు. బొబ్బిలి యుద్ధం బుర్రకథ కోసం ఆరు నెలలు ఎందరితోనో చర్చించి, కథ రాసుకొని ఇటు బొబ్బిలిలోనూ, అటు విజయనగరంలోనూ కథ చెప్పి శభాష్ అనిపించుకున్నారు. ‘పుట్టిల్లు, అగ్గి రాముడు’ చిత్రాల్లో బురక్రథ ప్రదర్శించారు. ‘నిలువు దోపిడి, పెత్తందార్లు’ మొదలైన చిత్రాలకు పనిచేశారు. పూలరంగడు చిత్రంలో అక్కినేనికి బుర్రకథ నేర్పారు. 'మా భూమి' నాటకం కోసం జమునకు శిక్షణ ఇచ్చారు.
కమ్యూనిస్టు ఉద్యమాల్లో నాజర్ అనేక సార్లు జైలుశిక్ష అనుభవించారు. కొంతకాలం విప్లవ రచయితల సంఘంలో సభ్యుడిగా ఉన్నారు. జీవితం చివరి వరకు కటిక దరిద్రం అనుభవించారు. ‘ఆసామి’ నాటక రచనకు 18వ ఆంధ్ర నాటక పరిషత్ ప్రథమ బహుమతి పొందారు. ప్రముఖ పాత్రికేయుడు కె.ఎ.అబ్బాస్ నాజర్‌ను ‘ఆంధ్రా అమర్ షేక్’ అని అభివర్ణించారు. 1981లో ఆంధ్ర నాటక కళాపరిషత్ ఉత్తమ కళాకారుడిగా పురస్కారం అందించింది. 1986లో కేంద్ర ప్రభుత్వం ‘పద్మశ్రీ’ బిరుదుతో సత్కరించింది. నాజర్ ఆత్మకథ ‘పింజారి’. దీనిని అంగడాల వెంకట రమణమూర్తి కథనం చేశారు. 1997 ఫిబ్రవరి 21న నాజర్ గళం మూగబోయింది. తంబూర తీగ తెగిపోయింది. ఆయన తెలుగు జాతి సాంస్కృతిక చరిత్రలో చిరస్మరణీయుడు.
- డాక్టర్ దామెర వేంకట సూర్యారావు