రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజ్యసభలో మాట్లాడారు. రాష్ట్రపతి ప్రసంగం ఈ దశాబ్దానికే మార్గదర్శకమని కొనియాడారు. మన లక్ష్యాలను ఈ ప్రసంగం నిర్దేశించిందని చెప్పారు. 50 మందికి పైగా ఎంపీలు దీనిపై తమ అభిప్రాయాలు పంచుకున్నారని తెలిపారు. వారందరికీ కృతజ్ఞతలు చెప్పారు.
భారత్ అవకాశాల గని అని మోదీ పునరుద్ఘాటించారు. అనేక అవకాశాలు దేశం కోసం ఎదురుచూస్తున్నాయని అన్నారు. కలలు సాకారం చేసుకోవాలని కోరుకుంటున్న దేశం.. ఆ అవకాశాలను ఊరికే వదులుకోదని చెప్పారు. యువత ఆ అవకాశాలను అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు.
"ప్రపంచాన్ని కరోనా ఎలా మార్చేసిందో చూశాం. ఈ సంక్షోభాన్ని సమర్థంగా ఎదుర్కొన్నాం. ఇబ్బందులు అధిగమించి ముందుకు సాగుతున్నాం. భారత్ మరింత బలపడటానికి సంక్షోభం ఉపయోగపడింది. ఈ సంక్షోభం భారత సమాఖ్య వ్యవస్థకు నూతన బలాన్నిచ్చింది. భారత్ బలం గురించి ప్రపంచానికి తెలిసింది."
-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
దేశ ప్రజాస్వామ్యం మానవతా దృక్పథంపై ఆధారపడి ఉందన్నారు మోదీ. ప్రాచీన భారత్‌లో 81 ప్రజాస్వామ్యాలు ఉన్నట్లు తెలిపారు. జాతీయతపై జరిగే దాడుల గురించి దేశ పౌరులను హెచ్చరించాల్సిన అవసరం ఉందని అన్నారు.
"దేశ జాతీయవాదం సంకుచితం కాదు. స్వార్థం, దూకుడుతో కూడుకున్నది కాదు. సత్యం, శివం, సుందరం అనే విలువల ప్రేరణతో నిర్మితమైంది. ఈ నినాదం నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇచ్చారు. నేతాజీ ఆదర్శాలను మనం మర్చిపోయాం. భారత్‌ను అతిపెద్ద ప్రజాస్వామ్యంగా ప్రపంచదేశాలు చెప్పుకోవడం బాగానే ఉంటుంది. కానీ ప్రజాస్వామ్యానికి భారత్ అమ్మ వంటిదని మన పిల్లలకు చెప్పడం మర్చిపోతున్నాం. ప్రస్తుతం కొన్ని శక్తులు భారత్ ఎదుగుదలను అడ్డుకునేందుకు యత్నిస్తున్నాయి. ఈ శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. విదేశీ విధ్వంసక భావజాలం పట్ల జాగ్రత్తగా ఉండాలి."
-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
కనీస మద్దతు ధరపై
సాగు చట్టాలపై ప్రతిష్టంభన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)కు ఢోకా ఉండదని హామీ ఇచ్చారు. ఎంఎస్పీ ప్రస్తుతం ఉందని, ఇకపైనా కొనసాగుతుందని స్పష్టం చేశారు. రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని.. కేంద్రం-రైతుల మధ్య అనేక దఫాల చర్చలు జరిపాయని చెప్పారు. రైతుల అభ్యంతరాలను పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. అయితే, రైతుల ఆందోళనలకు కారణం ఏంటో తెలియట్లేదని అన్నారు. ఈ సందర్భంగా రైతుల కోసం కేంద్రం తీసుకొచ్చి పథకాల గురించి ప్రస్తావించారు.
ఇదీ చదవండి: ఎంఎస్పీ ఉంది.. ఇకపైనా ఉంటుంది: మోదీ
పంట ఉత్పత్తులను అమ్మకునేందుకు రైతులకు ఉన్న అడ్డంకులపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గతంలో చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు మోదీ. '1930లో ప్రవేశపెట్టిన మార్కెటింగ్ పాలన వల్ల రైతులు తమ ఉత్పత్తులను అధిక ధరకు విక్రయించలేకపోతున్నారని, ఈ అడ్డంకులను తొలగించడమే తమ లక్ష్యమని మన్మోహన్ చెప్పార'ని మోదీ స్పష్టం చేశారు. సాగు చట్టాలపై యూటర్న్ తీసుకున్నవారు దీనికి అంగీకరిస్తారని అన్నారు.
కరోనా కట్టడిలో విజయం
కరోనా పోరుపై వ్యక్తమైన అనుమానాలను భారత్ తప్పని నిరూపించిందని అన్నారు మోదీ. కోట్లాది మందికి కరోనా సోకి, లక్షల మంది మరణిస్తారని అంచనాలు వేశారని విపక్షాలనుద్దేశించి వ్యాఖ్యానించారు. మానవాళిని కాపాడినందుకు ఇప్పుడు ప్రపంచమే భారత్‌ను ప్రశంసిస్తోందని చెప్పారు. కరోనాపై పోరులో అనేక దేశాలకు అండగా నిలిచామని గుర్తు చేశారు మోదీ. ఇతర దేశాలకు టీకాను అందించినట్లు తెలిపారు. 150కి పైగా దేశాలకు ఔషధాలను సరఫరా చేసినట్లు చెప్పారు. ఈ గొప్పతనం ఏ ప్రభుత్వానికో, వ్యక్తులకో చెందదని.. మొత్తం భారత్‌కే సొంతమని అన్నారు. అతి తక్కువ సమయంలో టీకా అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తలను కొనియాడారు.
భారత్‌వైపే చూపు
దేశం అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని అన్నారు మోదీ. కరోనా సమయంలోనూ దేశానికి రికార్డు స్థాయిలో విదేశీ పెట్టుబడులు లభించాయని చెప్పారు. ప్రస్తుతం విదేశీ మారక నిల్వలు గరిష్ఠ స్థాయిలో ఉన్నయని తెలిపారు. భారత్ నుంచి ప్రపంచ దేశాలు రెండంకెల వృద్ధిని ఆశిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రపంచమంతా భారత్‌వైపే చూస్తోందని పేర్కొన్నారు. ప్రపంచదేశాల మెరుగుదలకు భారత్ తప్పక సహకరిస్తుందని విశ్వసిస్తున్నారని చెప్పారు.
టీఎంసీకి చురక!
మోదీ ప్రసంగం ప్రారంభం కాగానే టీఎంసీ ఎంపీలు సభ నుంచి వాకౌట్ చేశారు. ఈ నేపథ్యంలో అంతకుముందు టీఎంసీ ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మోదీ. 'డెరెక్ జీ తన ప్రసంగంలో వాక్ స్వాతంత్ర్యం, బెదిరింపులు వంటి పదాలను ఉపయోగించారు. ఆ ప్రసంగం విన్నప్పుడు.. ఆయన దేశం గురించి మాట్లాడుతున్నారా? లేదా? బంగాల్ గురించి మాట్లాడుతున్నారా అని అనుమానం కలిగింది. ఆయన 24 గంటలు వీటినే చూడాల్సి వస్తోంది కాబట్టి.. ఇక్కడ కూడా అవే మాట్లాడారేమో' అని చురకలు అంటించారు.