మనదేశంలో ఏటా కోటిన్నరకు పైగా జనాభా అదనంగా పెరుగుతోంది. 2018లో 1.79 కోట్ల జనాభా పెరిగింది. ఆ ఏడాది దేశవ్యాప్తంగా నమోదైన జనన, మరణాల ఆధారంగా తాజా జనాభా లెక్కలను జనగణన విభాగం విడుదల చేసింది.
ముఖ్యాంశాలివి...
- దేశ జనాభా 2018 డిసెంబరు 31 నాటికి 130.28 కోట్లను దాటిపోయింది. ఆ ఏడాదిలో 2.60 కోట్ల మంది శిశువులు పుట్టారు. అంటే రోజుకు 71,391, గంటకు సగటున 2,974 మంది పుట్టారు.
- అదే ఏడాది 80.77 లక్షలమంది కన్నుమూశారు. రోజుకు సుమారుగా 22,131 మంది చొప్పున కన్నుమూశారు. అంతకుముందు ఏడాది (2017)తో పోలిస్తే మరణాల సంఖ్య 40 వేలు తగ్గింది.
- జనన మరణాలను లెక్కిస్తే నికరంగా 1.79 కోట్ల జనాభా అదనంగా పెరిగినట్లు అంచనా.
- పుట్టిన 6 నెలల్లోనే కన్నుమూసిన బాలల సంఖ్య లక్షా 74 వేలు. అంతకుముందు ఏడాదితో పోలిస్తే నవజాత శిశు మరణాలు 9 వేలు పెరిగాయి.
- సరిగ్గా 18 ఏళ్లలో దేశంలో జననాలు 100 శాతం పెరగడం గమనార్హం. 2000 సంవత్సరంలో కోటీ 29 లక్షల మంది పుట్టగా 2018లో 2 కోట్ల 60 లక్షలమంది జన్మించారు. ఇదే 18 ఏళ్ల కాలవ్యవధిలో మరణాలు 156 శాతం పెరిగి 31.44 లక్షల నుంచి 80.77 లక్షలకు చేరాయి.
- ఏటా కోటిన్నరకు పైగా జనాభా పెరుగుతున్నందున 2018కే 130 కోట్లు దాటినందున ప్రస్తుత దేశజనాభా 132 కోట్లకు చేరి ఉంటుందని భావిస్తున్నట్లు ఓ అధికారి ‘ఈనాడు’కు చెప్పారు.
- దేశంలో ఎక్కడ జననం లేదా మరణం సంభవించినా 21 రోజుల్లోగా పంచాయతీ లేదా మున్సిపల్ కార్యాలయంలో నమోదు చేయించాలి.
- 2018 సంవత్సరం జననాల్లో 83.1 శాతం నమోదయ్యాయి.
- ఏపీలో 89.8, తెలంగాణలో 71.8 జననాలనే నిర్ణీత గడువులోగా నమోదు చేయించారు.
- దేశంలోని మొత్తం జననాల్లో 2018లో బాలురు 52 శాతం, బాలికలు 47.9 శాతం ఉన్నారు.
పురుషుల్లోనే మరణాలెక్కువ...
- 2018లో నమోదైన 69.50 లక్షల మరణాల్లో పురుషులు 59.6 శాతం, మహిళలు 40.4 శాతం ఉన్నారు.
- తెలంగాణలో 69.1 మరణాలనే నిర్ణీత 21 రోజుల్లో నమోదు చేయించారు.
- ఏపీ సహా 13 రాష్ట్రాల్లో వందశాతం మరణాలను నమోదు చేయిస్తున్నారు.
ఇదీ చూడండి: విమానాల్లో ప్రయాణికుల సామర్థ్యం పెంపు