ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి రాజధాని అయినందుకే కాదు, రెండు కోట్లకు పైబడిన జన సంఖ్యతో ఎకాయెకి 140 దేశాల కన్నా మిన్నగా ఎదిగిన మహానగరంగా దిల్లీ విలక్షణత ఎనలేనిది. 70 మంది సభ్యులతో అలరారే దిల్లీ విధాన సభకు వచ్చే నెల ఎనిమిదిన ఎన్నికల ముహూర్తాన్ని నిర్వాచన్ సదన్ నిర్ణయించగానే రాజధాని రాజకీయం రసకందాయంలో పడింది. కోటీ 47 లక్షలమందికిపైగా ఓటర్లతో రాజిల్లే ఎన్నికల ప్రక్రియ కోసం 13,750 పోలింగ్ కేంద్రాల్ని, తొంభై వేలమంది అధికార సిబ్బందిని సిద్ధం చేసిన ఈసీ- దివ్యాంగులు, ఎనభై ఏళ్లు పైబడినవారి సౌకర్యం కోసం తొలిసారి పోస్టల్ బ్యాలెట్‌కు సమ్మతించింది. నామినేషన్ల దాఖలు చివరినాటి దాకా ఓటర్ల నమోదు, ఓటరు స్లిప్పుల మీద క్యూఆర్ కోడ్ ఈసారి విశిష్టతలుగా వాసికెక్కుతున్నాయి.
గణాంకాలు
రాజధాని అసెంబ్లీకి ఇప్పటిదాకా ఆరు సార్లు ఎన్నికలు జరగగా, 1993లో తొలిసారి బోణీ కొట్టింది భాజపానే. ముగ్గురు ముఖ్యమంత్రుల ముచ్చటగా కమలనాథుల పాలన దరిమిలా వరసగా ముమ్మార్లు షీలాదీక్షిత్ సారథ్యంలో జయకేతనం ఎగరేసింది హస్తం పార్టీయే! జాతీయ పార్టీలుగా కాంగ్రెస్ భాజపాల ముఖాముఖికి- 2012 నవంబరులో కేజ్రీవాల్ నేతృత్వంలో ‘ఆప్’ రాకతో తెరపడింది. 2013, 2015 ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ జన మానస పుత్రికగా సాధించిన అపురూప విజయాలతో దిమ్మెరపోవడం భాజపా, హస్తం పార్టీల వంతు అయింది. 2015 ఎన్నికల్లో 54.3శాతం ఓట్లతో 67సీట్లు సాధించిన ‘ఆప్’ ప్రభ- 2017 మున్సిపల్ ఎన్నికల్లో 26శాతం ఓట్లకు, నిరుటి లోక్‌సభ ఎన్నికల్లో 18శాతానికి దిగజారడం- ప్రత్యర్థి పక్షాలకు కొత్త ఆశలు రేకెత్తిస్తున్న పరిణామం! 2014 లోక్‌సభ ఎన్నికల్లో మోదీ మేనియా దిల్లీలోని మొత్తం ఏడు లోక్‌సభా స్థానాలనూ ఊడ్చేసి, 60కి పైగా అసెంబ్లీ సీట్లలో మెజారిటీ ఓట్లు ఒడిసిపట్టినా, 2015 అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా స్కోరు కేవలం మూడుకే పరిమితం కావడం కమలనాథులకు మింగుడు పడలేదు. నిరుటి లోక్‌సభ ఎన్నికల్లోనూ దిల్లీలో భాజపా అప్రతిహత విజయాలు నమోదు చేసినా ఈసారి అసెంబ్లీ సమరంలో ఓటర్ల మొగ్గు ఎటో తెలియక కమలం పార్టీ, ఆటలో అరటిపండుగా మిగిలిపోయే దురవస్థలో కాంగ్రెస్ బెంగటిల్లుతున్నాయిప్పుడు!
దుమ్ముదులిపిన ఆమ్ ఆద్మీ
‘మనం మొదటి శ్రేణి పౌరులం... కానీ తృతీయ శ్రేణి ప్రభుత్వం చేతిలో బాధితులం’ అంటూ కేజ్రీవాల్ స్థాపించిన ఆమ్ ఆద్మీ పార్టీ- సర్కారీ యంత్రాంగాల్లో అవినీతి కసవును ఊడ్చేసే ఝాడూ (చీపురు కట్ట)యే ఎన్నికల గుర్తుగా 2013లోనే సత్తా చాటింది. 29.5 శాతం ఓట్లతో 28 సీట్లు సాధించి, అసలు పోటీయే కాదు పొమ్మన్న ప్రత్యర్థి పక్షాలకు చుక్కలు చూపించింది. కాంగ్రెస్ వెలుపలి మద్దతుతో అధికారానికి వచ్చినా, జన్ లోక్‌పాల్ బిల్లు విషయంలో కేంద్రంతో సమశ్రుతిలేక ఏడు వారాలకే రాజీనామా చేసి కేజ్రీవాల్ నిష్క్రమించగా- 2015 ఎన్నికల్లో 95శాతంపైగా సాఫల్య రేటుతో ‘ఆప్’కే ప్రజానీకం పునరధికారం కట్టబెట్టింది.
అవినీతిపై ఎత్తిన కత్తిగా జాతీయ రాజకీయాల్లోనూ ‘ఆప్’ పాదముద్రల్ని విస్తరించడానికి కేజ్రీవాల్ విఫలయత్నం చెయ్యడం తెలిసిందే. పంజాబులో మినహా ఝార్ఖండ్‌లాంటి తక్కిన చోట్ల ‘నోటా’ కంటే తక్కువ ఓట్లు పడటం- కేజ్రీవాల్ పరిమితుల్ని గుర్తు చేసేదే! ప్రజలెన్నుకొన్న ప్రభుత్వంపై దిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ పెత్తనాన్ని ప్రశ్నిస్తూ ‘ఆప్’ వేసిన కేసులో సుప్రీంకోర్టు నిరుడు జులై మొదటి వారంలో చారిత్రక తీర్పు ఇచ్చింది. దిల్లీ ప్రభుత్వ అధికార పరిధినుంచి రాజ్యాంగం మినహాయించిన భూమి, పోలీస్, శాంతి భద్రతలు తప్ప తక్కిన అన్ని అంశాల్లో లెఫ్ట్‌నెంట్ గవర్నర్ మంత్రి మండలి సలహామేరకు నడుచుకోవాల్సిందేనన్న తీర్పుతో పాలన రథం గాడిలో పడింది. అయిదేళ్లలో ‘ఆప్’ ఉద్ధరించిందేమీ లేదని భాజపా గుడ్లురుముతుండగా, షీలాదీక్షిత్ తీర్చిదిద్దిన నగరాన్ని కనీసం అలాగే కొనసాగించలేకపోయారని కాంగ్రెస్ విరుచుకుపడుతోంది. ‘అచ్ఛే బీత్ పాంచ్ సాల్- లగే రహో కేజ్రీవాల్’ (మంచిగా గడిచిన అయిదేళ్లు- కేజ్రీవాల్‌కే మళ్ళీ ఓట్లు) అన్న నినాదంతో బరిలో దిగుతున్న ‘ఆప్’ ధీమాగా ముందడుగేస్తోంది!
క్రితంసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఐపీఎస్ అధికారి కిరణ్ బేడీని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించి కుదేలైపోయిన కమలం పార్టీ- ప్రస్తుతం 34శాతంగా ఉన్న ఓట్లకు మరో ఏడుశాతం జమపడితే ఉట్టికొట్టేది తామేనని గట్టిగా విశ్వసిస్తోంది. భాజపా, కాంగ్రెసులు ముందుగా ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించే అవకాశం లేకపోవడాన్ని రాజకీయంగా సొమ్ము చేసుకొనే క్రమంలో- కేజ్రీవాల్‌కు ప్రత్యామ్నాయం ఎవరు అని ప్రశ్నిస్తున్న ‘ఆప్’; అయిదేళ్ల విజయాల్నే ప్రస్తావించి ఓట్లు అడుగుతామంటోంది. 2015 అసెంబ్లీ పోరులో 9.7 శాతం ఓట్లతో అసలు ఖాతాయే తెరవలేకపోయిన హస్తం పార్టీ నిరుటి లోక్‌సభ ఎన్నికల్లో ఏడింట అయిదు చోట్ల రెండో స్థానంలో నిలవడం- తన భాగ్య రేఖలు వికసిస్తున్నాయనడానికి సూచికగా భావిస్తోంది!
ప్రధాన పోరు వీటి మధ్యే...
కేంద్రంలో, దిల్లీలో అధికారంలో కొనసాగుతున్న భాజపా, ఆమ్‌ఆద్మీల మధ్యే ప్రధాన పోరు తథ్యమయ్యే వాతావరణంలో విద్య, ఆరోగ్యం, విద్యుత్, మంచినీరు, రవాణా, మహిళల భద్రత వంటి కీలకాంశాల్లో కేజ్రీవాల్ సర్కారు చూపిన చొరవకు జనాదరణ మెండుగానే ఉంది. దిల్లీలోని 1731 అనధీకృత కాలనీల్లోని వారికి పట్టాలు ఇచ్చింది తామేనని భాజపా చెబుతుంటే, ఆయా చోట్ల మౌలిక సదుపాయాల పరికల్పన ‘ఆప్’ చలవేనని దిల్లీ ప్రభుత్వం చాటుతోంది. ఐఎఎన్‌ఎస్- సి ఓటర్ వంటి సర్వేలు ‘ఆప్’దే అధికారం అంటుంటే, అసలైన సమరం మోదీ జనాకర్షణ, కేజ్రీవాల్ పాలన దక్షతల మధ్యే కేంద్రీకృతం కానుంది. భిన్న రాష్ట్రాల్లో భాజపా ప్రభ తగ్గుతున్న తరుణంలో దిల్లీని గుప్పిటపట్టేలా కమలనాథుల వ్యూహం ఎలా రాటుదేలనుందో చూడాలి!
ఇదీ చూడండి : నేడు 'భారత్ బంద్'- పాల్గొననున్న 25 కోట్ల మంది!