కరోనాను కట్టడి చేసేందుకు ప్రపంచంలోనే అతిపెద్ద లాక్‌డౌన్ భారత్‌లో అమలవుతోంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 21 రోజుల లాక్‌డౌన్‌ను బుధవారం నుంచి పాటిస్తున్నాయి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు. తొలిరోజు నిత్యావసరాలకు మినహా ప్రజలు ఎవరూ ఇళ్ల నుంచి బయటకురాకుండా పోలీసులు పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నారు. రహదారులపై వాహనాలను తనిఖీ చేసిన తర్వాతే అనుమతిస్తున్నారు. అనవసరంగా బయటకువస్తే దండనలు తప్పడం లేదు.
ఆయా రాష్ట్రాల్లో లాక్డౌన్కు సంబంధించిన పరిస్థితులు ఇలా ఉన్నాయి.
దిల్లీలో..
దిల్లీలో లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేస్తున్నారు. సరిహద్దులను మూసివేసి... ప్రతి ఒక్కరిని, ప్రతి వాహనాన్ని తనిఖీచేసిన తర్వాతే అనుమతిస్తున్నారు. సరైన కారణాలు చెప్పని ప్రయాణికులను తిప్పి పంపుతున్నారు.
ముంబయిలో..
ఆర్థిక రాజధాని ముంబయిలో లాక్‌డౌన్ వల్ల రహదారులన్నీ బోసిపోయాయి. అత్యవసర సర్వీసులు, వాటిలో పనిచేసే సిబ్బంది మినహా రోడ్లపై ఎవరూ కనిపించలేదు. పలు చోట్ల వైరస్ నిరోధక ద్రావణాలను పారిశుద్ధ్య సిబ్బంది పిచికారీ చేశారు. నిత్యావసర సరుకుల కోసం వచ్చే వారు సామాజిక దూరాన్ని పాటించాలని పోలీసులు ముగ్గులు గీసి వాటిలో వినియోగదారులను నిలబెట్టారు.
బంగాల్లో..
బంగాల్ వ్యాప్తంగా నిత్యావసరాల కోసం వచ్చేవారిని మినహా ఎవరినీ పోలీసులు బయట తిరగడానికి అనుమతించలేదు.
తమిళనాడులో..
మెట్రో నగరం చెన్నై సహా తమిళనాడువ్యాప్తంగా రహదారులు నిర్మానుష్యంగా మారాయి. జాతీయ రహదారులను బారికేడ్లతో మూసివేశారు పోలీసులు. ఆంబులెన్సులు, నిత్యావసరాలు తీసుకెళ్లేవారిని మాత్రమే అనుమతిచ్చారు. కొన్నిచోట్ల అనవసరంగా రోడ్లపైకి వచ్చిన వారిపై లాఠీచార్జ్ చేశారు.
ఒకటి నుంచి తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థులకు పరీక్షలను రద్దు చేసింది తమిళనాడు ప్రభుత్వం. వారిని తదుపరి తరగతులకు పంపాలని నిర్ణయించింది.
ఉత్తర్‌ప్రదేశ్‌లో..
ఉత్తర్‌ప్రదేశ్‌లో లాక్‌డౌన్ పకడ్బందీగా అమలు చేస్తున్నారు. లఖ్‌నవూలో రహదారులు నిర్మానుష్యంగా మారాయి. నిత్యావసరాలైన కూరగాయలు, పాల కోసం మాత్రమే ప్రజలను అనుమతించారు.
ఆధ్యాత్మిక నగరం వారణాసిలో ఆలయాలు తెరుచుకోలేదు.
మధ్యప్రదేశ్‌లో..
మధ్యప్రదేశ్ విదిశలో ఆంక్షలు ఉల్లఘించి రోడ్లపైకి వచ్చిన వారిని పోలీసులు మందలించారు. అక్కడికక్కడే గుంజీలు తీయించడం వంటి శిక్షలు విధించారు.
పంజాబ్‌లో..
పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో నిత్యావసర వస్తువులు సరఫరా చేసే వారు తప్ప ఎవరూ రోడ్లపై కనిపించలేదు. లూధియానాలో రోడ్లు నిర్మానుష్యంగా కనిపించాయి.