పేదలు, అణగారిన వర్గాలకు సేవ చేయడమే ప్రధాని మోదీ పుట్టిన రోజును ఉత్తమంగా నిర్వహించే మార్గమని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పేర్కొన్నారు. మోదీ జన్మదినం సందర్భంగా దిల్లీలో నిర్వహించిన 'సేవా సప్త' కార్యక్రమంలో పాల్గొన్నారు నడ్డా.
దేశంలోని ప్రతీ ఇంటికీ విద్యుత్ అందే విధంగా ప్రధాని మోదీ నిర్ణయం తీసుకున్నారని నడ్డా తెలిపారు. మూడేళ్లలోనే 2.5 కోట్ల కుటుంబాలకు విద్యుత్ కనెక్షన్ ఇచ్చినట్లు చెప్పారు. మోదీ తీసుకొచ్చిన మార్పుతో భాజపా ప్రస్తుతం సేవా కార్యక్రమాలను సైతం నిర్వహిస్తోందని చెప్పారు.
"రాజకీయాలు, ఎన్నికల్లో పోరాడటం పార్టీల విధి. అయితే.. దేశ సంస్కృతితో పాటు పార్టీ విధానాలను మోదీ మార్చేశారు. ఇప్పుడు, మేం రాజకీయాలు మాత్రమే చేయడం లేదు. సేవా కార్యక్రమాలను కూడా చేపడుతున్నాం."
-జేపీ నడ్డా, భాజపా అధ్యక్షుడు
అంతకుముందు 'లార్డ్ ఆఫ్ ది రికార్డ్స్' అనే పుస్తకాన్ని విడుదల చేశారు నడ్డా. భాజపా ప్రధాన కార్యాలయంలో పుస్తకావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు.
పథకం విస్తరణ
మోదీ పుట్టిన రోజు సందర్భంగా ఉద్యోగ కల్పన పథకాలను ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్(కేవీఐసీ)విస్తరించినట్లు సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. 'సేవ దివస్'లో భాగంగా 10 నగరాల్లోని 1500 మందికి ఈ పథకాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించింది.
ఇదీ చదవండి- 'ముంబయిలో రోజుకు 500 కిలోల డ్రగ్స్ వినియోగం!'