అయోధ్య తీర్పు వెలువడిన సమయంలో దేశ ప్రజలు పూర్తి సహనంతో ఉన్నారని తెలిపారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. దేశం కంటే ప్రధానమైంది ఏమీ లేదని 130 కోట్లమంది ప్రజలు నిరూపించారని మన్ కీ బాత్ కార్యక్రమం సందర్భంగా వ్యాఖ్యానించారు. ప్రజలు సంయమనంతో వ్యవహరించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు ప్రధాని.
'ఈ రాజ్యాంగ దినోత్సవం ప్రత్యేకం'
నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని ఉద్ఘాటించారు ప్రధాని. రాజ్యాంగం పూర్తయి 70 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా 26న పార్లమెంట్ వేదికగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. రాజ్యాంగ విశిష్టతపై దేశవ్యాప్తంగా ఏడాది పొడవునా కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రకటించారు.
'డిసెంబర్.. క్విట్ ఇండియా మాసం'
శీతాకాలంలో వ్యాయామం చేసి చెమటోడ్చాలని పిలుపునిచ్చారు ప్రధాని. డిసెంబర్‌ను క్విట్ ఇండియా ఉద్యమ మాసంగా పాటించాలన్నారు మోదీ.
విశాఖపట్నం సముద్రంలో ప్లాస్టిక్ తొలగించిన స్కూబా డైవర్లకు మోదీ అభినందనలు తెలిపారు. దేశ ప్రజలు కూడా ప్లాస్టిక్‌ను నియంత్రించడంలో భాగం కావాలన్నారు.
'పుష్కరాలపై'
నవంబర్ 4 నుంచి 16వరకు జరిగిన బ్రహ్మపుత్ర నదీ పుష్కరాలను గుర్తు చేశారు ప్రధాని. అసోంలో జరిగిన ఈ పుష్కరాలకు సరైన ప్రచారం లభించలేదన్న అసోం వాసితో మోదీ ఏకీభవించారు. పుష్కరాలు జాతీయ సమగ్రతను పెంచుతాయన్నారు. సమాజం నదులతో అనుసంధామైందని వివరించారు. పుష్కరాలను పర్యటకంగా, ఆధ్యాత్మికంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. వచ్చే ఏడాది తుంగభద్ర నదికి పుష్కరాలు జరగనున్నాయని ఈ సందర్భంగా వెల్లడించారు.
'ఎన్సీసీ విద్యార్థులతో ప్రత్యేక సంభాషణ'
71వ ఎన్సీసీ దినోత్సవం సందర్భంగా ఎన్సీసీ కేడెట్లతో ప్రత్యేకంగా సంభాషించారు ప్రధాని. ఎన్సీసీలో వారి అనుభవాలను తెలుసుకున్నారు. దేశ సమగ్రతపై వారికున్న అభిప్రాయాలను సావధానంగా విన్నారు మోదీ.
ఈ సందర్భంగా 'మీరూ ఎన్సీసీ కేడెట్‌గా ఉన్నారు. ఎప్పుడైనా పనిష్మెంట్ తీసుకున్నారా' అని ఓ విద్యార్థి అడిగిన ప్రశ్నకు జవాబిచ్చారు. తానెప్పుడూ ఎన్సీసీలో పనిష్మెంట్ తీసుకోలేదని అయితే పతంగికి చిక్కుకున్న ఓ పిట్టను రక్షించేందుకు భవనం ఎక్కానని, ఆసమయంలో శిక్ష తప్పదేమోనని భయపడినట్లు చెప్పారు.
ఇదీ చూడండి: ఆకట్టుకున్న చెన్నై 'మెగా వాల్ పెయింటింగ్ '