ప్రపంచమంతా కరోనాతో పోరాడుతున్న వేళ భారత్‌ను ఉగ్రవాద సమస్య వేధిస్తోంది. కశ్మీర్లో బలగాలు, ముష్కరుల మధ్య ఎదురుకాల్పులు ప్రతిరోజూ జరుగుతున్నాయి. దిల్లీలోనూ ఇటీవల ముష్కరులు పట్టుబడ్డారు. తాజాగా గుజరాత్ అహ్మదబాద్‌లో ఉగ్రదాడికి అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. రథయాత్ర సందర్భంగా దాడులు చేసేందుకు యత్నించే అవకాశం ఉందని పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తమయ్యారు గుజరాత్ పోలీసులు. బహిరంగ ప్రాంతాలు, దుకాణాల్లో సీసీటీవీ నిఘా ఉండాలని సూచించారు. 15 రోజుల సీసీటీవీ ఫుటేజీని సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు.
గురువారం నుంచి ఆగస్టు 9 వరకు అహ్మదబాద్‌లో 144 సెక్షన్ అమలులో ఉంటుందని నగర పోలీస్ కమిషనర్ ఆశీశ్ భాటియా ప్రకటించారు. గుజరాత్లో ప్రతిష్ఠాత్మకంగా జరిగే జగన్నాథ రథయాత్ర జూన్ 23న జమాల్పూర్లోని ఆలయం నుంచి ప్రారంభమవుతుంది. ఈ ఉత్సవానికి ఉగ్రముప్పు నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు అధికారులు.
ఇదీ చూడండి: 'ఐదేళ్లలో 29 శాతం పెరిగిన ఆసియా సింహాలు'