జమ్ముకశ్మీర్‌లో గతంతో పోలిస్తే ఉగ్రదాడులు చాలా వరకు తగ్గిపోయాయని, దాదాపు సున్నాకు చేరాయని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అన్నారు. ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపడమే లక్ష్యంగా ఆర్మీ, పారామిలటరీ, జమ్ముకశ్మీర్ పోలీసులు సమన్వయంతో కృషి చేస్తున్నారని కొనియాడారు. జమ్మూకశ్మీర్‌లో ఇటీవల జరిగిన ఉగ్రదాడుల అంశాన్ని కాంగ్రెస్ సభ్యుడు సురేష్ లోక్‌సభలో లేవనెత్తారు. దీనిపై స్పందిస్తూ రాజ్‌నాథ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఉగ్రదాడులు సున్నా
జమ్ముకశ్మీర్‌లో ప్రస్తుతం ఉగ్రదాడులు తగ్గిపోయాయని, దాదాపు సున్నాకు చేరాయని రాజ్‌నాథ్ అన్నారు. జమ్ముకశ్మీర్ మినహా గత ఐదేళ్లలో దేశంలో ఎక్కడా పెద్ద ఘటనలు జరగలేదన్నారు.
ప్రతిపక్షాల ఆందోళనలు
మరోవైపు జమ్మూకశ్మీర్‌లో సాధారణ వాతావరణం నెలకొందంటూ ప్రభుత్వం ఊదరగొడుతోందని, సభను తప్పుదోవ పట్టిస్తోందని సురేష్ అభ్యంతరం వ్యక్తంచేశారు. జమ్మూకశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు నెలకొల్పాలని ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేశారు. మంగళవారం జమ్ముకశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లాలో జరిగిన పేలుడులో ఇద్దరు మరణించగా.. గత నెల జరిగిన మరో ఉగ్ర ఘటనలో పశ్చిమ బంగాల్‌కు చెందిన ఐదుగురు మరణించారని తెలిపారు.