ఐరోపా సమాఖ్య ప్రతినిధులు పర్యటిస్తున్న వేళ కశ్మీర్లో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. తాజాగా కుల్గాం జిల్లాలో పనిచేస్తున్న రోజువారీ కూలీలు ఐదుగురిని అపహరించి.. అనంతరం వారిని చంపేశారు. ఒకరిని గాయాలతో వదిలేశారు. బాధితులు బంగాల్లోని ముర్షిదాబాద్కు చెందినవారని పోలీసులు వెల్లడించారు.
ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు తీవ్రంగా గాలిస్తున్నాయి. తనిఖీలు చేపట్టేందుకు అదనపు బలగాలను రప్పించారు అధికారులు. గత రెండు వారాల్లో కశ్మీర్లో ఇది ఆరో ఉగ్రదాడి.
ఆర్టికల్ 370 రద్దు అనంతరం వాహన చోదకులు, కూలీలే లక్ష్యంగా దాడులు చేస్తున్నారు ముష్కరులు. ఉదంపుర్ జిల్లాలో సోమవారం ఓ వాహన చోదకుడిపై కాల్పులు చేసి చంపారు. షోపియాన్ జిల్లాలో ఈ నెల 24న ఇద్దరు, 14వ తేదిన ఒకరు.. మొత్తం ముగ్గురు వాహన చోదకులను పొట్టన పెట్టుకున్నారు. అంతకుముందు ఓ ఆపిల్ వ్యాపారిని.. ఓ ఇటుకలు తయారు చేసే వ్యక్తిని కాల్చిచంపారు.