బుజ్జగింపులు... బెదిరింపులు... విజ్ఞప్తులు... వ్యూహాలు... రాజీనామాలు... ఉదయం నుంచి కన్నడ రాజకీయంలో చోటుచేసుకున్న రసవత్తర పరిణామాలు ఇవి.
శాసనసభ్యుల రాజీనామాతో సంక్షోభంలో చిక్కుకున్న కాంగ్రెస్-జేడీఎస్ కూటమి... అధికారం నిలబెట్టుకునేందుకు ఉదయం నుంచి విశ్వప్రయత్నాలు చేస్తోంది. మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ పేరిట తిరుగుబాటుకు ప్రతివ్యూహం అమలుచేసేందుకు యత్నిస్తోంది. అయినా... స్వతంత్ర ఎమ్మెల్యేలు మద్దతు ఉపసంహరించుకోవడం, మరికొందరు కూటమి ఎమ్మెల్యేలు రాజీనామాకు సిద్ధపడడం... కుమారస్వామి సర్కారు కొనసాగడంపై అనుమానాలు పెంచుతున్నాయి.
బుజ్జగింపుల పర్వం...
ఆదివారానికి కాంగ్రెస్-జేడీఎస్ కూటమికి చెందిన 14 మంది ఎమ్మెల్యేలు శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు. వారిని బుజ్జగించేందుకు కూటమి అగ్రనేతలు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. తిరుగుబాటు ఎమ్మెల్యేల ప్రతినిధి రామ లింగారెడ్డితో ఈ ఉదయం ముఖ్యమంత్రి కుమారస్వామి ఓ రహస్య ప్రదేశంలో చర్చలు జరిపారు. రాజీనామా ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
తిరుగుబాటు ఎమ్మెల్యేలను దారికి తెచ్చుకునే లక్ష్యంతో పదునైన వ్యూహం రచించింది కాంగ్రెస్-జేడీఎస్ కూటమి. మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ అంశాన్ని తెరపైకి తెచ్చింది. గంటల వ్యవధిలోనే చర్చించి, నిర్ణయం తీసుకుని... మంత్రులు అందరితో రాజీనామా చేయించింది. అసమ్మతి ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడం ద్వారా వారిని దారికి తెచ్చుకోవాలన్న ఆలోచనతో ఇలా చేసింది కూటమి.
ఈ బుజ్జగింపులు ఫలిస్తున్నాయన్న సంకేతాలిస్తూ... తిరుగుబాటు ఎమ్మెల్యేల క్యాంపు నుంచి కీలక ప్రకటన వెలువడింది. ప్రస్తుతం ముంబయిలో ఉన్న ఎమ్మెల్యే సౌమ్యారెడ్డి... మంగళవారం ఉదయం బెంగళూరులో జరిగే కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశానికి హాజరవుతారన్నది ఆ వార్త సారాంశం. సౌమ్యతోపాటు మరికొందరు సొంత పార్టీలకు తిరిగి రావచ్చన్న ఊహాగానాలు వినిపించినా... ఎవరినీ నమ్మలేని పరిస్థితి.
మంత్రుల రాజీనామా...
తిరుగుబాటు ఎమ్మెల్యేలను బుజ్జగించే పనిలో కాంగ్రెస్-జేడీఎస్ నేతలు నిమగ్నమై ఉండగా.... స్వతంత్ర ఎమ్మెల్యేలు కూటమిని వీడడం కుమారస్వామికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.
ఇటీవలే ప్రభుత్వంలో చేరిన స్వతంత్ర శాసనసభ్యుడు నగేశ్... మంత్రి పదవికి రాజీనామా చేశారు. కూటమికి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు గవర్నర్కు లేఖ సమర్పించారు. వెంటనే ముంబయి వెళ్లి, ఇప్పటికే రాజీనామా చేసిన ఎమ్మెల్యేలతో జట్టు కట్టారు.
కొద్ది గంటలకే... మరో స్వతంత్ర ఎమ్మెల్యే శంకర్ అదే బాట పట్టారు. మంత్రి పదవికి రాజీనామా చేశారు.
మరో మంత్రి, బీదర్ తూర్పు ఎమ్మెల్యే రహీం మహమూద్ ఖాన్.... మంత్రి పదవికి రాజీనామా చేస్తానని హెచ్చరించారు. ఆయన ఏ క్షణంలోనైనా నగేశ్, శంకర్ బాటలో పయనించే అవకాశం ఉంది.
మరికొందరు ఎమ్మెల్యేలు...?
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సుధాకర్, నాగరాజ్... శాసనసభ్యత్వానికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం.
భాజపా వ్యూహాలు...
ఎమ్మెల్యేల రాజీనామాతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న కూటమిపై ఒత్తిడి పెంచేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది భాజపా. కుమారస్వామి రాజీనామాకు డిమాండ్ చేస్తూ మంగళవారం నిరసనలు చేపట్టాలని నిర్ణయించింది. శాసనసభ్యుల మద్దతు కోల్పోయిన స్వామికి అధికారంలో కొనసాగే నైతిక అర్హత లేదన్నది భాజపా వాదన.
మంగళవారం నిర్ణయం...
కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేల రాజీనామాపై స్పీకర్ మంగళవారం నిర్ణయం తీసుకునే అవకాశముంది. రాజీనామాలను ఆయన ఆమోదిస్తే... కూటమి మెజార్టీ కోల్పోనుంది. తర్వాత గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.
ఇదీ చూడండి:- కర్'నాటకం'లో మా పాత్ర లేదు: రాజ్నాథ్