దేశంలో కరోనా కేసుల ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకు కేసులు మరణాలు రికార్డు స్థాయిలో నమోదవుతూనే ఉన్నాయి. మహమ్మారి వ్యాప్తి ఆందోళనకరంగా ఉన్నప్పటికీ.. రికార్డు స్థాయిలో రికవరీలు ఉండటం కొంత ఊరట. ఇదివరకు ఎన్నడూలేనంతగా బుధవారం (24 గంటల్లో) 28,472 మంది కోలుకున్నారు. రికవరీ రేటు కూడా పెరిగింది. దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య 12 లక్షలకు చేరువైంది.
రికవరీ రేటు 63.13%
దేశంలో రికవరీ రేటు 63.13 శాతానికి చేరింది. గత 4 రోజులుగా ఇది 63 శాతం కంటే తక్కువగానే ఉంది. కొవిడ్ బారిన పడినవారిలో మొత్తం 7.53 లక్షల మంది కోలుకున్నారు. యాక్టివ్ కేసుల కంటే కోలుకున్నవారి సంఖ్య 3.41 లక్షలు అధికంగా ఉంది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం దిల్లీ, లద్దాఖ్, తెలంగాణలు వరుసగా 84.83%, 84.31%, 78.37% రికవరీతో మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి.
రాష్ట్రాల్లో తీవ్రత..
దేశంలో బుధవారం అత్యధిక కేసులు నమోదైన రాష్ట్రాల్లో మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లు తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. రోజువారీ మరణాల్లోనూ ఈ 3 రాష్ట్రాలే ముందున్నాయి.
ఇదీ చూడండి:అసోం గజగజ.. వరదలకు 89 మంది మృతి