మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీపై ప్రధాని నరేంద్రమోదీ ఆరోపణలు... భాజపా, కాంగ్రెస్ మధ్య తీవ్ర మాటల యుద్ధానికి దారితీశాయి. రాజీవ్‌పై మోదీ చేసిన అవినీతి ఆరోపణలపై దుమారం సద్దుమణగకముందే బుధవారం కీలక వ్యాఖ్యలు చేశారు ప్రధాని. రాజీవ్ కుటుంబం ఐఎన్ఎస్ విరాట్ యుద్ధనౌకను విహార యాత్రకోసం వినియోగించిందని దిల్లీలో భాజపా ఎన్నికల ప్రచార సభలో ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై మండిపడ్డ కాంగ్రెస్.. భారత వాయుసేన విమానాలను మోదీ సొంత ట్యాక్సీల్లా వాడారని ఎదురుదాడికి దిగింది.
"మోదీ.. మీ అబద్ధాలు చివరి దశకు చేరుకున్నాయి. ఎన్నికల ప్రచారానికి భారత వాయుసేన విమానాలను మోదీ సొంత ట్యాక్సీల్లా వాడారు. ఉదాహరణకు 2019 జనవరి 15న హిమాచల్ ప్రదేశ్‌లోని బలాంగీర్ నుంచి పఠాన్చెడా వెళ్లినందుకు అత్యల్పంగా రూ.744 చెల్లించారు. మీ తప్పులు మిమ్మల్ని వెంటాడుతుంటే.. ఇతరులపై వేళ్లు చూపిస్తున్నారు."
-రణ్‌దీప్ సింగ్ సుర్జేవాలా, కాంగ్రెస్ అధికార ప్రతినిధి
'అసత్యాలు చెప్పడమే పని'
ఐఎన్ఎస్ విరాట్‌ను రాజీవ్ గాంధీ దుర్వినియోగం చేశారన్న ఆరోపణలను తిప్పికొట్టారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ కేడా. అది అధికార పర్యటనేనని విశ్రాంత నేవీ వైస్ అడ్మిరల్ వినోద్ పస్రిచా ప్రకటించినా.. మోదీకి అవేమీ పట్టవని విమర్శించారు.
"మోదీకి నిజాలు పట్టవు. వారు చెప్పుకోవటానికి చేసిందేమీ లేదు. ఆర్నెల్లుగా రఫేల్, నిరుద్యోగం, నోట్లరద్దుపై చర్చకు రావాలంటూ రాహుల్ సవాల్ విసురుతున్నా.. ఒక్క మాటైనా మాట్లాడరు. ఇప్పుడు 30 ఏళ్ల క్రితం జరిగిన విషయం గురించి మోదీ మాట్లాడుతున్నారు. మోదీ ఓ అబద్ధాలకోరు. మాజీ అధికారులు చెబుతున్నా మోదీ అసత్య ప్రచారం మానుకోవట్లేదు.
వైఫల్యాలనూ ఓట్లుగా మలుచుకోగలరు మోదీ. అందుకు పుల్వామా ఉగ్రదాడే ఉదాహరణ. నిఘా వ్యవస్థ భారీ వైఫల్యంతో మన సైనికులు అమరులయ్యారు. మేం మీ గురించి మాట్లాడుతుంటే రాజీవ్ గాంధీని అడ్డం పెట్టుకుంటున్నారు. మీ ప్రభుత్వ హయాంలోనే బోఫోర్స్ కేసులో రాజీవ్‌కు దిల్లీ హైకోర్టు క్లీన్చిట్ ఇచ్చింది."
-పవన్ కేడా, కాంగ్రెస్ అధికార ప్రతినిధి
వాళ్లది విహార యాత్ర.. మాది దండయాత్ర
రాజీవ్ గాంధీపై మోదీ వ్యాఖ్యలను సమర్థిస్తూ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు.
"పనిమంతులు భారత నావికాదళాన్ని ఉగ్రమూకలపై దండయాత్రకు ఉపయోగిస్తారు. పేరుగొప్ప వాళ్లు మాత్రం కుటుంబ విహారయాత్రలకు వాడతారు."
-అరుణ్ జైట్లీ, కేంద్ర ఆర్థిక మంత్రి
ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం రాజీవ్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు మోదీ. 1987 సమయంలో పది రోజుల పాటు లక్షద్వీప్‌లో బంధువులు, స్నేహితులతో విహారయాత్రకు వెళ్లినప్పుడు ఐఎన్ఎస్ విరాట్‌ను ట్యాక్సీలా వాడారని అన్నారు. ఓ యుద్ధనౌకపైకి విదేశీయులను ఎలా ఎక్కించారని ప్రశ్నించారు మోదీ.
ఇదీ చూడండి: రాజీవ్ కేసు దోషుల విడుదలపై పిటిషన్ తిరస్కరణ