పోలీసులు తన ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేశారన్న ఉక్రోశంతో... ఓ యువకుడు తనకు తానే నిప్పు పెట్టుకున్న ఘటన తమిళనాడులోని అంబూర్ పట్టణంలో జరిగింది. తీవ్రంగా గాయపడిన ఆ యువకుడిని పోలీసులు సకాలంలో ఆసుపత్రికి తరలించారు. దీనితో ప్రాణాపాయం తప్పింది.
పోలీసుల కథనం ప్రకారం
"అంబూర్కు చెందిన 27 ఏళ్ల మొగిలన్ ఓ ప్రైవేటు ఫ్యాక్టరీలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. అతను లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తూ రోడ్‌పైకి వచ్చాడు. దీనితో అతని ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేశాం. అయితే ఆ యువకుడు తన బండి తనకు ఇవ్వాలని మమ్మల్ని ప్రాధేయపడ్డాడు. అందుకు నిబంధనలు ఒప్పుకోవని... తరువాత బండిని అప్పగిస్తామని చెప్పాం.
దీనితో అక్కడ నుంచి వెళ్లిపోయిన ఆ యువకుడు కొద్దిసేపటి తరువాత మళ్లీ వచ్చాడు. అప్పటికే అతను మద్యం మత్తులో ఊగిపోతున్నాడు. తన వాహనాన్ని తనకు ఇచ్చి తీరాలని పట్టుబట్టాడు. బండి ఇప్పుడు ఇవ్వడం కుదరని, తరువాత ఇస్తామని అతనికి సర్దిచెప్పాం. అయితే ఉక్రోశం పట్టలేక ఆ యువకుడు తనకు తానే నిప్పు అంటించుకున్నాడు."
- పోలీసులు
ఎఫ్ఐఆర్ నమోదు..
ఈ ఘటనపై... ప్రమాదవశాత్తు జరిగిన అగ్నిప్రమాదంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. ఈ ఘటనలో వాహన తనిఖీలు చేపట్టిన ఐదుగురు పోలీసులను ఇప్పటికే తిరుపత్తూరులోని జిల్లా ప్రధాన కార్యాలయానికి తరలించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కేసును డిప్యూటీ సూపరింటెండెంట్ స్థాయి అధికారి పర్యవేక్షిస్తారని ఆయన స్పష్టం చేశారు.
కరోనాపై పోరు
కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో... గత రెండు వారాలుగా తమిళనాడులో కఠిన లాక్‌డౌన్‌ను అమలుచేస్తున్నారు. ఇందులో భాగంగా తమిళనాడు పోలీసులు ఇప్పటి వరకు 6,30,662 వాహనాలు సీజ్ చేశారు. రూ.17.84 కోట్ల మేర జరిమానాలు విధించారు.
ఇదీ చూడండి: పద్మనాభుడి ఆలయ వివాదం ఏమిటి?