తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి.. దివంగత జయలలిత నివాసమైన పోయస్ గార్డెన్‌లోని వేద నిలయంను ఆమె స్మారక కేంద్రంగా మార్చాలని భావిస్తున్న తమిళనాడు ప్రభుత్వం.. అందుకు సంబంధించిన చర్యలు ప్రారంభించింది. జయ ఇంటిని స్వాధీనం చేసుకునేందుకు చెన్నై స్థానిక న్యాయస్థానంలో 67 కోట్ల 90లక్షల రూపాయలను డిపాజిట్ చేసింది.
ఈ ఇంట్లో జయలలిత చెల్లించాల్సిన ఆదాయపన్ను, ఆస్తిపన్ను బకాయిలు సుమారు 37 కోట్ల రూపాయలు ఉన్నాయి. అవి మాఫీ చేసేందుకు దాదాపు 24,322 చదరపు అడుగుల ఆ స్థలం విలువ రూ. 23 కోట్లు కాగా.. అదనంగా 36.9 కోట్లు చెల్లించింది ఆ రాష్ట్ర ప్రభుత్వం.
జయలలిత నివాసాన్ని ఆమె స్మారక కేంద్రంగా మార్చడం తమిళనాడు ప్రజలు, అన్నాడీఎంకే కార్యకర్తల హృదయపూర్వక ఆకాంక్ష అని ఆ రాష్ట్ర మంత్రి డి.జయకుమార్ అన్నారు. జయలలిత ఆస్తులకు మేనల్లుడు జే.దీపక్, మేనకోడలు జే.దీప వారసులు అని ఈ ఏడాది మేలో తమిళనాడు హైకోర్టు తీర్పు వెలువరించింది.
అయితే వేద నిలయంను స్మారక కేంద్రంగా మార్చేందుకు తమిళనాడు ప్రభుత్వం స్థానిక రెవెన్యూ అధికారులను ఆశ్రయించింది. ఈ విజ్ఞప్తిని పరిశీలించిన అధికారులు.. సరైన పరిహార హక్కు, భూసేకరణలో పారదర్శక హక్కు కింద స్మారక కేంద్రంగా మార్చేందుకు జయ నివాసాన్ని స్వాధీనం చేసుకోవచ్చని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో దీపక్, దీప.. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేయడం లేదా పరిహారం కోరే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: 'సారీ.. డబ్బుతో పాటు మీ ప్యాంటూ దొంగిలించా!'