మహారాష్ట్ర కాంగ్రెస్ నాయకులతో ముంబయిలో చర్చలు జరిపారు శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే. ప్రభుత్వ ఏర్పాటుపై చర్చలు సరైన దిశలో జరుగుతున్నట్లు సమావేశం అనంతరం తెలిపారు. సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు ఠాక్రే.
ఠాక్రేతో భేటీలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్, మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు బాలసాహెబ్ థోరట్ పాల్గొన్నారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చిన మరునాడే కాంగ్రెస్ నేతలతో భేటీ అయ్యారు ఠాక్రే.
ప్రభుత్వ ఏర్పాటుపై భేటీలో చర్చలు జరిపారా? అని థోరట్ను మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. ఇది మర్యాదపూర్వక సమావేశమేనని బదులిచ్చారు. కాంగ్రెస్తో శివసేన భేటీ జరగడమే సానుకూల అంశమని చెప్పారు థోరట్. స్నేహపూర్వక వాతరణం నెలకొల్పడం కోసమే సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఉమ్మడి కార్యాచరణపైనే..
శివసేనతో కలిసి కనీస ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక రూపొందించే అంశంపైనే ఠాక్రేతో సమావేశమైనట్లు థోరట్ పేర్కొన్నారు. కాంగ్రెస్-ఎన్సీపీ కలిసి ఒక నిర్ణయానికి వచ్చాక ఠాక్రేతో మరోసారి చర్చలు జరుపుతామన్నారు.
కనీస ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక కోసం తమ పార్టీనుంచి ఇప్పటికే ఐదుగురు సభ్యులను నియమించింది ఎన్సీపీ. కాంగ్రెస్ కూడా తమ సభ్యులను త్వరలోనే నియమించనుంది.
ఇదీ చూడండి: జేఎన్యూ ఫీజుల పెంపుపై విద్యార్థుల పోరు తీవ్రం