కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి సంజయ్ అగర్వాల్‌తో బుధవారం జరిగిన సమావేశం నుంచి పంజాబ్ రైతు సంఘాల ప్రతినిధులు వాకౌట్ చేశారు. వ్యవసాయ చట్టాలకు సంబంధించిన ప్రతులను చించి వేసి.. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
కేంద్రమంత్రి నరేంద్ర సింగ్ తోమర్ సమావేశానికి హాజరవుతారని తాము భావించామని, ఆయన రాకపోవడం వల్ల నిరాశతో తాము సమావేశం నుంచి వైదొలిగినట్లు పేర్కొన్నారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్‌తో రైల్వేట్రాక్‌పై బైఠాయించటం, నిరసనలు చేయడం ఇకమీదటా కొనసాగుతాయని స్పష్టంచేశారు. దీనిపై గురువారం నిర్ణయం తీసుకుంటామన్నారు.
కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాల గురించి దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి. ప్రతిపక్షాలు, రైతులు వీటిని వ్యతిరేకిస్తున్న క్రమంలో పంజాబ్‌కు చెందిన కొన్ని రైతు సంఘాల ప్రతినిధులను సమావేశానికి కేంద్రం ఆహ్వానించింది. దిల్లీలోని కృషి భవన్‌లో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంతో తాము సంతృప్తి చెందలేదని పేర్కొన్న రైతులు.. వ్యవసాయ చట్టాలను రద్దు చేయడమే తమ ప్రధాన డిమాండ్ అన్నారు. వాకౌట్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ చోటుచేసుకోకుండా పోలీసులు రంగంలోకి దిగారు.