సరిహద్దు వద్ద భారత్-చైనా బలగాల మధ్య ప్రతిష్టంభన నెలకొన్న తరుణంలో రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సమస్యను పరిష్కరించడాని సైనిక, దౌత్య స్థాయిలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. అయితే భారత దేశ కీర్తి ప్రతిష్టలను ఎట్టిపరిస్థితుల్లో ప్రభుత్వం దెబ్బతిననివ్వదని హామీనిచ్చారు.
"ఎట్టి పరిస్థితుల్లోనూ భారత కీర్తి ప్రతిష్టలు దెబ్బతినకుండా ప్రభుత్వం చూసుకుంటుంది. పొరుగు దేశాలతో మంచి సంబంధాలు పెట్టుకోవాలన్న విధానాన్ని భారత్ ఎప్పటి నుంచో అనుసరిస్తోంది. అందువల్ల తాజా పరిణామాల్లోనూ ఇదే పద్ధతిని కొనసాగిస్తుంది. చైనాతో సమస్యలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇదేమీ కొత్తకాదు. తూర్పు లద్దాఖ్‌లో నెలకొన్న సమస్యను పరిష్కరించడానికి సైనిక, దౌత్య స్థాయిలో ద్వైపాక్షిక చర్చలు జరుగుతున్నాయి."
- రాజ్‌నాథ్ సింగ్, రక్షణశాఖ మంత్రి.
భారత్-చైనా మధ్య మధ్యవర్తిత్వం వహించి సమస్యను పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవలే ప్రకటించారు. ఈ ప్రతిపాదనను భారత విదేశాంగ శాఖ తోసిపుచ్చింది. ఈ విషయంపై మాట్లాడుతూ.. తమ మధ్య ఉన్న విభేదాలను దౌత్య, మిలిటరీ స్థాయిలో పరిష్కరించుకునే సామర్థ్యం భారత్-చైనాకు ఉందని రాజ్‌నాథ్ ఉద్ఘాటించారు. ఇదే విషయాన్ని అగ్రరాజ్య రక్షణ కార్యదర్శి మార్క్ టీ ఎస్పర్‌కు తెలియజేసినట్టు పేర్కొన్నారు.
ఇలా మొదలు...
మే 5న తూర్పు లద్దాఖ్‌లో చైనా, భారత్ సైన్యం మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇరుదేశాలకు చెందిన దాదాపు 250 మంది సైనికులు రాళ్లు, కర్రలతో పరస్పరం దాడి చేసుకున్నారు. ఇందులో 100 మందికిపైగా గాయపడ్డారు. అనంతరం మే 9న ఉత్తర సిక్కిం వద్ద ఇదే తరహా ఘటన చోటు చేసుకుంది. నకులా పాస్ వద్ద జరిగిన ఈ ఘర్షణలో రెండు దేశాలకు చెందిన 10 మంది సైనికులు గాయపడ్డారు. అప్పట్నుంచి చైనా-భారత్ సరిహద్దులో మరోసారి ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.