ప్రపంచ ప్రఖ్యాత కట్టడం తాజ్‌మహల్ సోమవారం నుంచి పర్యటకులకు అందుబాటులోకి వచ్చింది. కరోనా వైరస్ ప్రభావం ఈ పర్యటక స్థలంపై కూడా పడటం వల్ల, మార్చి 17న మూసివేశారు. అయితే ఇప్పటి వరకు 160 టికెట్లు బుక్ అయ్యాయని, భారత్‌లో ఉంటున్న తైవాన్ పర్యటకుడు మొదటి సందర్శకుడని పురావస్తు శాఖ అధికారులు వెల్లడించారు.
కట్టుదిట్టమైన చర్యలతో..
"ఆరు నెలలుగా సందర్శకులకు అనుమతి లేకున్నా, తాజ్ మహల్ నిర్వహణను కొనసాగించాం. సందర్శనకు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో కొవిడ్ కట్టడి చర్యలను కట్టుదిట్టంగా అమలు చేయనున్నాం. దానిలో భాగంగా ప్రతి పర్యటకుడి ఉష్ణోగ్రతను పరిశీలించడం సహా శానిటైజర్ అందించనున్నాం. అలాగే రెండు స్లాట్లుగా మొత్తం 5,000 మందిని అనుమతించనున్నాం. ఒక్కోస్లాటుకు గరిష్టంగా 2,500 మందికి అనుమతి ఉంటుంది."
- భారత పురావస్తు శాఖ(ఏఎస్‌ఐ) అధికారులు
ఆన్‌లైన్, కోడ్ స్కానింగ్ ద్వారానే టికెట్లు కోనుగోలు చేయాల్సి ఉంటుందని, అందుకోసం ఏఎస్ఐ వెబ్‌సైట్, మొబైల్ యాప్ అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలిపారు. తక్షణ వైద్య సేవల నిమిత్తం అంబులెన్స్ సేవలను సిద్ధంగా ఉంచామని వెల్లడించారు.
సహజీవనం తప్పదు!
అయితే, ఇంత ఎక్కువ కాలం తాజ్‌మహల్‌ను మూసివేసిన సందర్భాలు లేవని పర్యటక రంగానికి చెందిన నిపుణులు అంటున్నారు. అలాగే అన్నీ సజావుగా సాగేలా ఏఎస్‌ఐ అధికారులు చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వం కూడా అంతర్జాతీయ విమానాలు నడిపే అంశంపై యోచించాలని వారు కోరుతున్నారు. కరోనాతోనే సహజీవనం చేయాల్సిన అవసరం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు.
ఇదీ చూడండి: 'సంక్షోభ సమయంలో ఒకరికొకరు మద్దతుగా నిలవాలి'