ప్రవాస భారతీయులకు ఇకపై 'ఆధార్' ఇక్కట్లు తప్పనున్నాయి. మూడు నెలలలోపే ఆధార్‌కార్డు జారీ చేసే విధానం తీసుకొస్తున్నట్లు విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ) తెలిపింది.
ప్రస్తుత విధానంలో ఎన్ఆర్ఐలు దరఖాస్తు చేసుకున్నాక కనీసం 180 రోజులకు కానీ ఆధార్ రాదు. ఈ పద్ధతిని మార్చనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ సందర్భంగా ప్రకటించారు. అందుకు అనుగుణంగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు యూఐడీఏఐ సీఈఓ అజయ్ భూషణ్ పాండే. ఇందుకోసం అవసరమైన సాంకేతిక మార్పులు చేస్తున్నట్లు వివరించారు.
అపాయింట్మెంట్ సదుపాయం
"కొత్త విధానంలో ఎన్ఆర్ఐలు విదేశాల్లో ఉండగానే ఆధార్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఏ సమయంలో, ఎక్కడ ఆధార్ కార్డ్ తీసుకోవాలో వారే నిర్ణయించుకోవచ్చు. భారత్‌కు వచ్చిన వెంటనే సంబంధిత కేంద్రానికి వెళ్లి ఆధార్‌ను పొందవచ్చు" అని చెప్పారు పాండే.
దేశవ్యాప్తంగా కేంద్రాల ఏర్పాటు
పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల తరహాలో దేశవ్యాప్తంగా 53 నగరాల్లో 114 ఆధార్ సేవా కేంద్రాలు ఏర్పాటు చేస్తోంది యూఐడీఏఐ. ఆధార్ కోసం కొత్తగా నమోదు, ఉన్నవాటిలో మార్పులు వంటివి ఇక్కడ చేసుకోవచ్చు. ఇప్పటికే ఆధార్ సంబంధిత సేవలు అందిస్తున్న బ్యాంకులు, తపాలా కార్యాలయాలకు ఇవి అదనం.
ఇదీ చూడండి:రాహుల్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేతలు సిగ్గుపడాలి: షా