కర్ణాటక దావనగరేలో ఆటో నడిపి జీవితం గడుపుతానని ఉద్యోగాన్ని వదులుకున్న ఓ డాక్టర్... మీడియా సాయంతో మళ్లీ జిల్లా వైద్యాధికారిగా బాధ్యతలు చేపట్టారు.
![Suspended doctor who turned as an auto driver become a Medical Officer](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/kn-dvg-01-10-matte-doctor-script-7203307_10092020093807_1009f_00229_725_1009newsroom_1599724550_318.jpg)
ఆటోపై ఆవేదన
బళ్లారి జిల్లా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలో జిల్లా వ్యాక్సిన్ అధికారిగా 24 ఏళ్లు విధులు నిర్వర్తించారు రవీంద్రనాథ్. అయితే.. సాంకేతిక బిడ్డింగ్ రికార్డుల్లో అవకతవకలు జరిగాయని 2019, జూన్ 6న సస్పెండ్ చేశారు అధికారులు. క్లర్క్ చేసిన పొరపాటుకు తాను బలయ్యాయన్నది రవీంద్రనాథ్ వాదన. సస్పెండ్ అయిన తర్వాత బెల్గాంలోని కర్ణాటక అప్పీలేట్ ట్రైబ్యునల్‌ను(క్యాట్) ఆశ్రయించారు ఆయన. రెండు సార్లూ ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చింది. కానీ అధికారులు పోస్టింగ్ ఇవ్వలేదు.
అధికారుల తీరుతో విసిగిపోయిన రవీంద్రనాథ్.. ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఇన్నాళ్లు డాక్టర్‌గా సేవలందించిన ఆయన.. ఆటో డ్రైవర్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకోవాలనుకున్నారు. ఆటో డ్రైవర్‌గా మారారు. 'ఐఏఎస్ అధికారుల వల్ల వచ్చిన కష్టాల జీవితం' అని తన ఆటో మీద రాసుకున్నారు.
స్పందించిన ప్రభుత్వం
డాక్టర్ రవీంద్రనాథ్ ఆటోపై రాసుకున్న వేదనను ఈటీవీ భారత్ సహా, ఇతర మీడియా విస్తృతంగా ప్రచారం చేసింది. దీంతో కర్ణాటక ప్రభుత్వం స్పందించింది. కొప్పల్ జిల్లా వైద్యాధికారిగా నియమించింది. ముగిసిపోయిందనుకున్న తన వైద్య జీవితానికి మళ్లీ ప్రాణం పోసిన మీడియాకు ధన్యవాదాలు తెలిపారు రవీంద్రనాథ్.
"మరో రెండు రోజుల్లో విధుల్లోకి చేరుతాను. అంతిమంగా న్యాయం, నిజమే గెలిచాయి. నేను ఇన్నాళ్లు నిజాయితీగా పని చేశాను. ఇకపైనా అలానే పని చేస్తాను. పేదలకు సేవలందిస్తాను. ప్రభుత్వం కళ్లు తెరిపించిన మీడియాకు ధన్యవాదాలు. "
-డాక్టర్ రవీంద్రనాథ్ , జిల్లా వైద్యాధికారి
ఇదీ చదవండి: ఆటో డ్రైవర్‌గా మారిన డాక్టర్.. కారణమిదే...