భారత విదేశీ వ్యవహారాల శాఖ మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ మృతిపై విచారం వ్యక్తం చేశారు విదేశీ విదేశాంగ మంత్రులు. ఆమె చేసిన సేవలను కొనియాడుతూ పలు దేశాల ప్రతినిధులు ట్విట్టర్లో సంతాపం తెలిపారు.
" సుష్మా స్వరాజ్ కుటుంబానికి, ఆమె అభిమానులకు నా ప్రగాడ సానుభూతి. భారత్లో అత్యంత గౌరవం పొందిన నేతల్లో ఒకరు. భారతీయుల కోసం అంకిత భావంతో ఆమె చేసిన సేవ చిరస్మరణీయం. ఇండో-ఫ్రెంచ్ సంబంధాలను ఉన్నత శిఖరాలకు చేర్చారు."
- అలెగ్జాండ్రి జీల్జర్, ఫ్రాన్స్ రాయబారి
సుష్మా మృతికి అఫ్గానిస్థాన్ విదేశాంగ మంత్రి ట్విట్టర్లో సంతాపం తెలిపారు.
" సుష్వా స్వరాజ్ అకాల మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. భారత దేశ ప్రజలకు, ప్రభుత్వానికి ప్రగాఢ సానుభూతి. విశిష్ట సంకల్పంతో దేశానికి ప్రాతినిధ్యం వహించిన గొప్ప నేత."
- ఆర్ రబ్బాని, అఫ్గాన్ విదేశాంగ మంత్రి
" సోదరి సుష్మా స్వరాజ్ మరణ వార్త విచారకరం. ఉన్నత నాయకురాలు, గొప్ప వక్త. ప్రజల మనిషి. భారత దేశ ప్రజలకు, సుష్మా కుటుంబ సభ్యులకు సానుభూతి తెలుపుతున్నా. "
-హమీద్ కర్జాయ్, అఫ్గానిస్థాన్ మాజీ అధ్యక్షుడు
మాల్దీవులు, భారత్ మధ్య సంబంధాల బలోపేతానికి సుష్మా ఎంతో కృషి చేశారని ట్వీట్ చేశారు ఆ దేశ విదేశాంగ మంత్రి అబ్దుల్లా షాహిద్.
" నా మంచి స్నేహితురాలు సుష్వా స్వరాజ్ మరణ వార్త బాధించింది. గొప్ప దౌత్యవేత్త. మంచి వ్యక్తి. మాల్దీవులు, భారత్ మధ్య స్నేహ సంబంధాల పునరుద్ధరణకు ఎంతో కృషి చేశారు."
-అబ్దుల్లా షాహిద్, మాల్దీవులు విదేశాంగ మంత్రి.