ఈ ఏడాది గణేశ్ చతుర్థికి వినాయకుడి విగ్రహాలను కొవిడ్ థీమ్‌తో రూపొందించి కరోనా వారియర్స్‌కు మద్దతుగా నిలిచారు కళాకారులు. ఇదే క్రమంలో గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన సూక్ష్మ కళాకారుడు డింపుల్ జవారియా.. మట్టి, నిరుపయోగంగా పడి ఉన్న వస్తువుల మిశ్రమంతో చిన్ని చిన్ని విగ్రహాలను తయారు చేసి ఔరా అనిపించాడు. ప్రతిఏటా సూక్ష్మరూపంలోని వినాయకులను సృష్టిస్తూ.. భక్తుల మన్ననలు పొందుతున్నాడు.
ఈ చిన్ని వినాయకుల సైజ్ కేవలం 1.5 మిల్లీమీటర్ నుంచి 1.5 అంగుళాలే. డింపుల్ రూపొందించిన వాటిలో.. ఊయలలో పడుకున్న గణేశుడు, సింహాసనంపై కూర్చున్న విఘ్నేశ్వరుడు. మూషికంతో ఆడుకుంటున్న వినాయకుడు వంటి ఆకృతులు ఉన్నాయి. అలాగే కరోనా మహమ్మారిని అంతమొందిస్తున్నట్లు ఉన్న వినాయకుడి విగ్రహం అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది.
1.5 మిల్లీమీటర్ల గణేశుడిని రూపొందించేందుకు ప్రయత్నించి సఫలమయ్యాను. బంకమట్టి, పూసలు, ప్లాస్టిక్ వస్తువులు, పెన్నుల వంటి వ్యర్థ పదార్థాలతో 15 విగ్రహాలను తయారు చేశాను. భక్తుల వినతి మేరకు ప్రతిఏటా ఇలాంటి గణేశుడి విగ్రహాలను తయారు చేస్తాను.
- డింపుల్ జవారియా, సూక్ష్మ కళాకారుడు.
ఒక్కో విగ్రహం తయారు చేసేందుకు 20 నిమిషాలు సమయం పట్టిందిని తెలిపారు డింపుల్. ఈ ఏడాది డిమాండ్ లేకపోవటం వల్ల తయారు చేసిన విగ్రహాలన్నీ తన ఇంటిలోనే ప్రతిష్ఠించినట్లు చెప్పారు.
ఇదీ చూడండి: ఔరా: సుద్దముక్క, పెన్సిల్ నిబ్‌పై గణేశుడు