రాముడు అయోధ్యలో జన్మించినట్టు దాదాపుగా అందరూ అంగీకరించినా, ఆ నగరంలో ఎక్కడ పుట్టాడన్నది తేల్చడం సమస్యగా మారింది. దీనిపై తీర్పు వెలువరించే ముందు సుప్రీంకోర్టు ‘వాల్మీకి రామాయణం’, ‘స్కంద పురాణం’, ‘తులసీదాస్ రామచరిత మానస్’లను పరిగణనలోకి తీసుకొంది. ఇవి ఆధారాలు కావంటూ పూర్తిగా కొట్టిపారేయలేమని పేర్కొంది. హిందూ మతానికి ఇలాంటి గ్రంథాలే మూలాలని అభిప్రాయపడింది. అందులోని శ్లోకాలను ఉటంకించింది. కోర్టు పేర్కొన్న అంశాలు.
స్కంద పురాణంలో స్థల వర్ణన
ఎనిమిదో శతాబ్దంలో రచించిన స్కంద పురాణంలో రాముడు జన్మించిన స్థలానికి సంబంధించిన వర్ణన ఉంది. జన్మించిన ప్రాంతంలో చేసిన కొన్ని పూజల సందర్భంగా చేసిన వర్ణన అది. ‘‘ఆ ప్రాంతానికి ఈశాన్యంలో ఉన్నదే రాముడు జన్మించిన స్థలం. ఆ స్థలం మోక్షాన్ని ప్రసాదించేది. విఘ్నేశ్వరుడికి తూర్పున, వశిష్ఠునికి ఉత్తరాన, లౌమాసకు పశ్చిమాన ఆ స్థలం ఉంది. జన్మస్థలంలో పవిత్ర పూజలు చేయడం ద్వారా ఆ వ్యక్తి తల్లిదండ్రులు, గురువుల పట్ల భక్తిభావంతో ఉంటాడు’’ అన్న ప్రస్తావన ఉంది.
రామచరిత మానస్‌లో...
తులసీదాస్ రచించిన రామచరిత మానస్‌లోని ‘చౌపాయి’ల్లో రాముడి జననంపై వర్ణన ఉంది. విష్ణుమూర్తి అవధ్‌పురిలోని దశరథుడు, కౌసల్య ఇంట్లో మానవ రూపం దాల్చుతారన్న ప్రస్తావన ఉంది. మసీదు నిర్మించిన 1528కు ముందే రచించిన గ్రంథాల్లో ప్రస్తావన ఉన్న కారణంగా రామజన్మభూమిగా పేర్కొనే ప్రాంతమే రాముడి పుట్టిన స్థలం అన్న విశ్వాసం హిందువుల్లో బలపడిందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.
క్రీస్తు పూర్వమే రాసిన వాల్మీకి రామాయణంలో నాలుగు శ్లోకాలు రాముడి జననాన్ని ప్రస్తావిస్తున్నాయి
- పదో శ్లోకంలో కౌసల్య.. కుమారుడికి జన్మనిచ్చింది. ఆబాలుడికి దైవత్వ లక్షణాలు ఉన్నాయి. అతడేమీ సామాన్యుడు కాదు. విశ్వ ప్రభువు రావడంతో అయోధ్య పునీతమయింది’’ అని ఉంది.
- అయిదో శ్లోకం ‘జన్మభూమి’ అన్న పదంతో ప్రారంభం అవుతుంది. ఇది మొత్తం నగరానికే తప్ప, ఏదో ఒక ప్రత్యేక ప్రాంతాన్ని సూచించదు.
- ఇతర శ్లోకాల్లోనూ రాముడి జననంపై ప్రస్తావన ఉంది.
- నాలుగో శ్లోకంలో అయోధ్యను ‘అవధ్ పురి’ అంటూ చేసిన వర్ణన ఉంది.
- ఏడో శ్లోకంలో ‘ఇహాన్’ (ఇక్కడ) అంటే అయోధ్యలో అన్న ప్రస్తావన ఉంది.
- దశరథుడి రాజప్రాసాదంలో కౌసల్య రాముడికి జన్మనిచ్చిందని రామాయణంలో ఉన్నా, స్థలం వర్ణన లేదు.