అయోధ్య రామ మందిరం వ్యవహారంలో మధ్యవర్తిత్వానికి సుప్రీంకోర్టు గడువు పెంచింది. భాగస్వామ్యపక్షాలతో చర్చలు పూర్తిచేసి, నివేదిక సమర్పించేందుకు ముగ్గురు సభ్యుల కమిటీకి ఆగస్టు 15 వరకు సమయం ఇచ్చింది.
జస్టిస్ ఖలీఫుల్లా నేతృత్వంలోని ప్యానెల్ ఈనెల 7న సమర్పించిన నివేదికను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయి నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం నేడు పరిగణనలోకి తీసుకుంది. ఏకాభిప్రాయం సాధించేందుకు మరింత సమయం కావాలన్న త్రిసభ్య ప్యానెల్ విజ్ఞప్తి పట్ల న్యాయస్థానం సానుకూలంగా స్పందించింది. మధ్యవర్తిత్వానికి గడువు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
"సానుకూల ఫలితం వస్తుందని కమిటీ సభ్యులు భావించినట్లయితే... ఆగస్టు 15 వరకు సమయం కోరినప్పుడు ఇవ్వడంలో ఇబ్బంది ఏముంది? అయోధ్య భూ వివాదం ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉంది. ఇప్పుడు గడువు ఎందుకు ఇవ్వకూడదు?"
- సుప్రీం ధర్మాసనం
కమిటీ ముందు హాజరవుతున్న భాగస్వామ్యపక్షాలు మధ్యవర్తిత్వంపై విశ్వాసం ఉన్నట్లు, పూర్తిగా కమిటీకి సహకరిస్తున్నట్లు న్యాయస్థానానికి తెలియజేశారు.
మధ్యవర్తిత్వ కమిటీకి గడువు పెంచడంపై న్యాయవాది ఒకరు అభ్యంతరం తెలిపారు. ఈ వాదనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.
"8 వారాల గడువు ఇచ్చాం.. నివేదిక వచ్చింది. అయితే జస్టిస్ ఖలీఫుల్లా ప్యానెల్ ఇచ్చిన నివేదికలో ఏముందో మాత్రం చెప్పలేం. గోప్యంగా ఉంచుతాం."
- సుప్రీం ధర్మాసనం
భాగస్వామ్యపక్షాలు తమ అభ్యంతరాలను ప్యానెల్‌కు తెలియజేసేందుకు సుప్రీంకోర్టు జూన్ 30వరకు గడువు ఇచ్చింది.
అయోధ్యపై మధ్యవర్తిత్వం విషయంలో జస్టిస్ ఖలీఫుల్లా ప్యానెల్ ఇప్పటివరకు ఎలాంటి పురోగతి సాధించిందో వెల్లడించమని, ఆ విషయం రహస్యమని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది.
ఇదీ నేపథ్యం...
అయోధ్యలోని 2.77 ఎకరాల వివాదాస్పద భూమిని సున్నీ వక్ఫ్ బోర్డ్, నిర్మోహి అఖాడా, రామ్ లల్లాకు సమానంగా పంచాలని 2010లో అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పునకు వ్యతిరేకంగా ఇప్పటివరకు సుప్రీంకోర్టులో 14 పిటిషన్లు దాఖలయ్యాయి.
ఈ వ్యాజ్యాలపై సుప్రీంకోర్టు మార్చి 8న కీలక నిర్ణయం తీసుకుంది. వివాద శాశ్వత పరిష్కారానికి మధ్యవర్తిత్వమే మార్గమని తీర్మానించింది. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఖలీఫుల్లా ఛైర్మన్‌గా మధ్యవర్తిత్వ ప్యానెల్ ఏర్పాటుచేసింది. ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్, సీనియర్ న్యాయవాది శ్రీరామ్ పంచును సభ్యులుగా నియమించింది. నివేదిక సమర్పించేందుకు ప్యానెల్‌కు 8 వారాల గడువు ఇచ్చింది.
జస్టిస్ ఖలీఫుల్లా నేతృత్వంలోని ప్యానెల్... ఉత్తర్‌ప్రదేశ్ ఫైజాబాద్ వేదికగా భాగస్వామ్యపక్షాలతో సమాలోచనలు జరిపింది. ఇప్పటివరకు జరిపిన చర్చల సారాంశాన్ని నివేదిక రూపంలో సుప్రీంకోర్టుకు అందజేసింది. మధ్యవర్తిత్వానికి మరింత గడువు కోరింది. ఇందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది.
- ఇదీ చూడండి: ఆప్ నేతలపై గంభీర్ పరువు నష్టం దావా