బాలీవుడ్ నటుడు, భాజపా ఎంపీ సన్నీ దేఓల్ చిక్కుల్లో పడ్డారు. సార్వత్రిక ఎన్నికల్లో పరిమితికి మించి ఖర్చు చేశారన్న ఆరోపణలపై దేఓల్కు ఈసీ నోటీసులు జారీ చేసింది.
పరిమితికి మించి సన్నీ ఖర్చు పెట్టారని ఎన్నికల సమయంలో ఈసీకి ఫిర్యాదులు అందాయి. ముందస్తు విచారణలో భాగంగా ఈసీ సూచించిన పరిమితి రూ.70 లక్షలు కాగా సన్నీ రూ.86 లక్షలు ఖర్చు చేసినట్టు తేలింది. ఈ నేపథ్యంలో చర్యలకు ఉపక్రమించింది ఈసీ.
ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఈసీ నిర్దేశించిన పరిమితికి మించి ఖర్చు చేసినట్లయితే వారిపై కఠిన చర్యలు ఉంటాయి. నిబంధనలకు మించి ఖర్చు చేస్తే ఎంపీలను సస్పెండ్ చేసే అధికారం ఈసీకి ఉంది.
తొలిసారి పోటీ
తొలిసారి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన సన్నీకి భాజపా కీలక స్థానం అప్పగించింది. పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ నుంచి పోటీ చేసిన ఈయన ప్రత్యర్థి కాంగ్రెస్ నేతపై 82,459 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇంతకు ముందు ఈ స్థానం నుంచి బాలీవుడ్ హీరో దివంగత నేత వినోద్ ఖన్నా ప్రాతినిధ్యం వహించారు. ఈ సారి ఆ స్థానాన్ని సన్నీకి కేటాయించారు.
ఇదీ చూడండి: నిష్పక్షపాతంగా సభను నిర్వహిస్తా: ఓం బిర్లా