పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు చేయూతనిచ్చేందుకు ముందుకొచ్చింది దిల్లీ వక్ఫ్ బోర్డు. ఈ మేరకు దేశవ్యాప్తంగా హింసాత్మక నిరసనల్లో మరణించిన వారి కుటుంబాలకు ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించింది. ఒక్కో మృతుని కుటుంబానికి 5 లక్షల 50 వేల రూపాయలను అందిస్తామని ప్రకటించింది.
సీఏఏ, ఎన్ఆర్సీ వ్యతిరేక నిరసనల సందర్భంగా పోలీసు కాల్పుల్లో చాలా మంది మరణించారని బోర్డు ఛైర్మన్ అమానతుల్లా ఖాన్ ఫేస్ బుక్‌లో ఆవేదన వ్యక్తం చేశారు. వారు చేసిన ప్రాణత్యాగాలు వృథా కావని తెలిపారు. లాఠీ ఛార్జిలో కంటి చూపు కోల్పోయిన జామియా మిలియా ఇస్లామియా విద్యార్థి మహమ్మద్ మిన్హా అజుద్దీన్‌కు వక్ఫ్ బోర్డులో శాశ్వత ఉద్యోగం కల్పిస్తున్నట్లు తెలిపారు. అలాగే అతనికి 5 లక్షల ఆర్థికసాయం అందించారు.
దేశవ్యాప్తంగా ఎగిసిపడిన నిరసనలు
పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ దేశాల ముస్లింమేతర శరణార్థులకు భారత పౌరసత్వం కల్పించే సీఏఏకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. ఈ నిరసనల కారణంగా ఉత్తర్ప్రదేశ్లో ఇప్పటి వరకు 16 మంది ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు-ఆందోళనకారులకు మధ్య జరిగిన ఘర్షణల కారణంగా ఇతర రాష్ట్రాల్లోనూ మరికొంత మంది మరణించారు.