పౌరసత్వ సవరణ చట్టానికి(సీఏఏ) వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా చెలరేగిన ఆందోళనలు అక్కడక్కడా కొనసాగుతూనే ఉన్నాయి. దిల్లీ, పశ్చిమ్ బంగా, కర్ణాటకల్లో నిరసనలు కనిపించాయి.
మరో ర్యాలీతో దీదీ!
బంగాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి సీఏఏ వ్యతిరేక ర్యాలీ నిర్వహించారు. కోల్‌కతా బిధాన్ సరణిలోని స్వామి వివేకానంద విగ్రహం నుంచి, గాంధీ భవన్ వరకు సాగిన ఈ నిరసన ప్రదర్శనకు దీదీ నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా.. కేంద్రంపై మండిపడ్డారు మమత బెనర్జీ. భాజపా, సీఏఏ, ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఎన్ఆర్సీకి సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ ఒకటి చెబితే, కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరొకటి చెబుతున్నారని విమర్శించారు దీదీ. ఇద్దరిలో ఎవరు నిజం చెబుతున్నారో అర్థం కావడం లేదని ధ్వజమెత్తారు.
"దేశవ్యాప్త ఎన్ఆర్సీ అమలుపై చర్చలే లేవు, అలాంటి ప్రతిపాదనే లేదని ప్రధాని అంటున్నారు. కానీ, కొద్ది రోజుల క్రితం హోం మంత్రి మాత్రం దేశమంతా ఎన్ఆర్సీ అమలవుతుందన్నారు. వీరిద్దరి వ్యాఖ్యలు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. వీరిలో ఎవరు నిజం మాట్లాడుతున్నారో నాకు తెలియడం లేదు."
-మమతా బెనర్జీ, బంగాల్ ముఖ్యమంత్రి
ఝార్ఖండ్ ప్రజలు ఎన్నికల్లో ఓడించి భాజపాకు తగిన బుద్ధి చెప్పారని పేర్కొన్నారు. దేశాన్ని విభజించాలని భాజపా బలంగా ప్రయత్నిస్తోందని... కానీ భారత ప్రజలు వారి ప్రయత్నాల్ని నెరవేరనీయరని ఆమె తెలిపారు.
ఏకమైన విద్యార్థి గళాలు..
దిల్లీ జంతర్‌మంతర్ వద్ద జరుగుతున్న నిరసనల్లో అనేక విశ్వవిద్యాలయాల నుంచి విద్యార్థులు భాగస్వాములవుతున్నారు. 'హల్లా బోల్'(గళం వినిపించండి), 'ఛాత్రా ఏక్తా జిందాబాద్'(విద్యార్థుల ఐకమత్యం జిందాబాద్) అనే నినాదాలు మారుమోగాయి.
జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం, జామియా మిలియా ఇస్లామియా, దిల్లీ యూనివర్సిటీల నుంచి విద్యార్థులు ఉమ్మడిగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ మండీ హౌస్ నుంచి జంతర్‌మంతర్ వరకు సాగింది. ఈ ప్రాంతంలో ఇప్పటికే సెక్షన్ 144 అమలు చేశారు పోలీసులు. కర్ణాటక హుబ్లీలోనూ నిరసనలు హోరెత్తాయి. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.