భారతదేశంలో ఆలయాలకు కొదువలేదు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఆలయాలు లెక్కకు మించి ఉన్నాయి. నేడు శివరాత్రి పర్వదినం సందర్భంగా దేశంలోని శివాలయాలు శివ నామస్మరణతో మార్మోగనున్నాయి. ప్రధాన ఆలయాల నుంచి గ్రామాల్లోని చిన్న చిన్న దేవాలయాల వరకు భక్తులతో కిటకిటలాడుతాయి. అయితే ప్రపంచంలోనే అతిపెద్ద ఏకశిల శివలింగం ఉన్న ఆలయం మనదేశంలోనే ఉందని చాలా మందికి తెలీదు. అతి ఎక్కడో కాదు మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌కు 32 కిలోమీటర్ల దూరంలోని భోజ్‌పుర్‌లో ఉంది. శివరాత్రి సందర్భంగా ఈ ఆలయ విశేషాలు తెలుసుకుందాం.
ఏకశిల-శివలింగం
భోజ్పుర్లోని మహా శివాలయాలన్ని భోజేశ్వర్ ఆలయంగా పిలుస్తారు. ఈ గుడిలో ఉండే శివలింగం ప్రపంచంలోనే అతిపెద్దదిగా ప్రసిద్ధి. 21 అడుగుల ఎత్తు, 18.8 అడుగుల వ్యాసార్ధంతో దీనిని ఏకశిలపై చెక్కారు.
అసంపూర్తి నిర్మాణం.. ఎందుకంటే
భోజేశ్వర్ ఆలయ నిర్మాణం అసంపూర్తిగా ఉంటుంది. ఆలయ గర్భగుడిలో బండరాళ్లను ముక్కలుగా చేసి పరిచారు. ద్వాపర యుగంలో కుంతీదేవి మహాశివుడికి పూజ చేస్తున్న సందర్భంలో ఒకేరాత్రిలో ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేయాలని పాండవులు సంకల్పించుకున్నారని.. అయితే నిర్మాణం పూర్తయ్యేలోపే తెల్లవారిపోవటం వల్ల అసంపూర్తిగా మిగిలిపోయినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఇప్పటికీ ఆ ఆలయం అలాగే ఉండిపోయింది.
శివరాత్రి రోజున లక్ష మందికిపైగా..
మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా భోళా శంకరుడిని దర్శించుకునేందుకు ఏటా లక్ష మందికిపైగా భక్తులు ఇక్కడికి వస్తారు. ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.