దేశవ్యాప్తంగా అమల్లో ఉన్న లాక్డౌన్ వల్ల ఎక్కడివారక్కడే చిక్కుకుపోయారు. ఫలితంగా వలస కూలీలతో పాటు అనేకమంది కాలినడకన తమ సొంతూళ్లకు బయలుదేరుతున్నారు. దివ్యాంగులకు కూడా ఈ లాక్డౌన్ తిప్పలు తప్పడం లేదు. తాజాగా ఆసోంలోని ఇద్దరు దివ్యాంగులు తమ మూడు చక్రాల సైకిల్‌పైనే 400 కిలోమీటర్ల ప్రయాణాన్ని ప్రారంభించారు.
ఈద్లోపు...
అలీ హుస్సేన్, అక్తర్ హుస్సేన్ అనే దివ్యాంగులు.. అసోంలో భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తుంటారు. గోలఘాట్ జిల్లాలోని నౌజాన్లో యాచిస్తూ కాలం గడుపుతున్న సమయంలో దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధిస్తున్నట్టు ప్రకటన వెలువడింది. అప్పటినుంచి వారు అక్కడే ఉండిపోయారు. 33రోజుల పాటు ఇతరుల ఇంట్లో ఉండి నిరీక్షించారు. రంజాన్ మాసం ఆరంభం కావడం.. లాక్డౌన్ ఎత్తివేతపై స్పష్టత లేకపోయినందున .. సహనం కోల్పోయారు. ఎలాగైనా సొంతింటికి వెళ్లాలని నిర్ణయించుకుని 400 కిలోమీటర్ల దూరంలోని సిల్చార్కు బయల్దేరారు. ఆదివారం నాటికి 90 కిలోమీటర్లు ప్రయాణించారు.
"లాక్డౌన్ వల్ల నౌజాన్లో చిక్కుకుపోయాం. కానీ పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైంది. కుటుంబ సభ్యులతో ఈద్ జరుపుకోవాలని ఉంది. అందుకే ఈ ప్రయాణం ప్రారంభించాం. ఈద్లోపు ఇంటికి చేరుకుంటామని ఆశిస్తున్నాం."
--- అలీ హుస్సేన్, వికలాంగుడు.
అలీ, అక్తర్‌లు రోజంతా చక్రాల కుర్చీలో ప్రయాణించి.. రాత్రి పూట రోడ్డు పక్కనే ఉన్న దుకాణాల ముందు పడుకుంటున్నారు. ఎలాగైనా ఈద్లోపు ఇంటికి చేరాలన్న దృఢ సంకల్పంతో ఉన్నారు.
ఇదీ చూడండి:- సీఎం కాన్వాయ్ కోసం అంబులెన్స్‌ను ఆపటంపై విమర్శలు