అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఏఎస్ అధికారులతో పాటు, దాదాపు 100 మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) విచారించడానికి అనుమతి కోరి నాలుగు నెలలు దాటింది. ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాలేదు. అవినీతి కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ), ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్(ఈడీ) వంటి దర్యాప్తు సంస్థలకు చెందిన అధికారులూ నిందితుల్లో ఉన్నారని సీవీసీ పేర్కొంది. నిబంధనల ప్రకారం అవినీతి అరోపణలు ఎదుర్కొంటున్న ప్రభుత్వ ఉద్యోగులపై విచారణ జరిపేందుకు నాలుగు నెలల నిర్ణీత సమయంలోపు ఆయా సంస్థలు అనుమతి ఇవ్వాల్సి ఉంది.
సుమారు 97 మంది అధికారులతో సంబంధం ఉన్న మొత్తం 51 కేసులలో, అత్యధికంగా ఎనిమిది కేసులు పర్సనల్ అండ్ ట్రైనింగ్ డిపార్ట్మెంటుపై ఉన్నాయి.
ఉత్తర్ప్రదేశ్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులను విచారించేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడం వల్ల ఆరు అవినీతి కేసులు పెండింగ్లో ఉన్నట్లు సీవీసీ తెలిపింది. ఇలాంటి కేసులే రక్షణ, రైల్వే, రసాయన ఎరువుల మంత్రిత్వ శాఖలతో పాటు పంజాబ్ నేషనల్ బ్యాంక్, జమ్ముకశ్మీర్ ప్రభుత్వానికి సంబంధించి పెండింగ్లో ఉన్నాయి. ఇంకా ఇతర సంస్థలు, మంత్రిత్వ శాఖలతో పాటు, అనేక రాష్ట్రాల్లో కేసులు పెండింగ్లో పడ్డాయి. ఇప్పటి వరకూ ఏ ఒక్కరూ విచారణకు అడిగిన అనుమతిపై స్పందించలేదు.
ఇదీ చూడండి:- గవర్నర్ కోషియారీ చేతిలో 'మహా' భవిష్యత్తు!