నూతన వ్యవసాయ చట్టాల అమలుపై ప్రభుత్వం లేదా సుప్రీంకోర్టు స్టే విధించినా.. తమ ఉద్యమం కొనసాగిస్తామని రైతులు స్పష్టం చేశారు. చట్టాలపై కొంతకాలం పాటు స్టే విధించడం పరిష్కారం కాదని పలువురు వ్యక్తిగతంగా తమ అభిప్రాయం వెల్లడించారు. చట్టాలను పూర్తిగా ఉపసంహరించాలని రైతులు కోరుకుంటున్నట్లు చెప్పారు. వాదనల సందర్భంగా సుప్రీం చేసిన వ్యాఖ్యలను స్వాగతించారు.
"సుప్రీంకోర్టు వ్యాఖ్యలను మేం స్వాగతిస్తున్నాం. కానీ నిరసనలను ఆపేయడం సరికాదు. స్టే విధించినా అది కోర్టు మళ్లీ వాదనలు వినేంతవరకే పరిమితమవుతుంది. చట్టాలను పూర్తిగా ఉపసంహరించుకోవాలని రైతులు కోరుకుంటున్నారు. ప్రభుత్వం, సుప్రీంకోర్టు స్టే విధించినా నిరసనలు కొనసాగుతాయి."
-గుర్నామ్ సింగ్ చదునీ, హరియాణా భారతీయ కిసాన్ యూనియన్ అధ్యక్షుడు
చట్టాలపై స్టే విధించడం పెద్ద విషయమేమీ కాదని భారతీయ రైతు సంఘం(మాన్సా) అధ్యక్షుడు భోగ్ సింగ్ మాన్సా పేర్కొన్నారు. చట్టాలను పూర్తిగా రద్దు చేయాలనే ఇక్కడ నిరసన చేపడుతున్నట్లు చెప్పారు. సవరణలకు అంగీకారం తెలిపినప్పుడే.. చట్టాల రద్దుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తేలిందని అన్నారు. రాజ్యాంగ విరుద్ధంగా ఉన్న చట్టాలను రద్దు చేయాలని సుప్రీంను కోరారు. సాగు చట్టాలు రద్దు చేసేంతవరకు లేదంటే భాజపా ప్రభుత్వం తన పాలనకాలం పూర్తి చేసుకునేంత వరకు నిరసనలు కొనసాగుతాయని హెచ్చరించారు.
చట్టాలు రద్దు చేయాలన్న డిమాండ్‌తోనే ఉద్యమం ప్రారంభమైందని, అందులో విజయం సాధించిన తర్వాతే దీనికి ముగింపు ఉంటుందని పంజాబ్ కిసాన్ యూనియన్ అధ్యక్షుడు రుల్దు సింగ్ మాన్సా తేల్చిచెప్పారు.
సుప్రీంలో వాదనలు
సాగు చట్టాలు, రైతుల ఆందోళనపై దాఖలైన పిటిషన్లపై సోమవారం వాదనలు ఆలకించింది భారత అత్యున్నత ధర్మాసనం. రైతులు ఆందోళనల విషయంలో కేంద్రం వైఖరిపై మండిపడింది. ప్రభుత్వం ప్రవర్తన పట్ల తీవ్ర నిరాశ చెందామని పేర్కొంది. సమస్యను పరిష్కరించేందుకు కమిటీని ఏర్పాటు చేస్తామని తెలిపింది. అదే సమయంలో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా చట్టాల అమలును కొంతకాలం నిలిపివేస్తారా? అని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. సమస్య పరిష్కారానికి ఇప్పటికే చాలా సమయం ఇచ్చామని.. అవసరమైతే ఈ చట్టాలపై స్టే విధించేందుకు కూడా వెనుకాడమని స్పష్టం చేసింది.
ఇదీ చదవండి: రానున్న నెలల్లో 30కోట్ల మందికి టీకా: మోదీ