కరోనా వైరస్‌కు మందు లేనుందున ఈ మహమ్మారిని ఎదుర్కోవాలంటే వ్యాధి నిరోధక శక్తి చాలా అవసరం. ఈ వైరస్ బారిన పడకుండా ఉండేందుకు పౌష్టికాహార తీసుకోవాలని సూచిస్తున్నారు పోషకాహార నిపుణురాలు సుజాత స్టీఫెన్. ఇందుకు సమతుల ఆహారం, తగిన నిద్ర, వ్యాయామం వంటి జాగ్రత్తలు తీసుకుంటే ఎటువంటి అనారోగ్య సమస్యలనైనా ఎదుర్కోవచ్చని చెబుతున్నారు. కరోనా సోకినట్లు అనుమానం ఉన్నవారు సైతం పౌష్టికాహారం తీసుకుంటే వ్యాధి నిరోధక శక్తి పెరిగి మహమ్మారి బారి నుంచి కోలుకోవచ్చని అంటున్నారు.
పౌష్టికాహారం తీసుకుంటేనే...
ప్రస్తుతం సాధారణ జలుబు, దగ్గు, జ్వరం వచ్చినా కూడా కరోనా వైరస్ వచ్చిందేమోనని ఆందోళన చెందుతున్నారు. వెంటనే ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. దీని వల్ల వైద్యులు 14 రోజులు గృహ నిర్బంధంలో ఉండమని సూచిస్తుండగా చాలామంది ఇళ్లకే పరిమితం అవుతున్నారు. ఈ సమయంలో ఆరోగ్యం కుదుట పడకుంటే మరోసారి వైద్యుల్ని సంప్రదించాలని సూచిస్తున్నారు. సాధారణంగా ఇలాంటప్పుడు మనం తీసుకునే ఆహారం, ఇతర జాగ్రత్తలు ప్రమాదకరమైన కొవిడ్-19 బారిన పడకుండా రక్షిస్తుంది. అందుకు పౌష్టికాహారం, తగిన విశ్రాంతి, వ్యాయామం వంటి వాటి వల్ల సులభంగా కోలుకుంటామని చెబుతున్నారు పౌష్టికాహార నిపుణురాలు సుజాత స్టీఫెన్.
ఆరోగ్యానికి పోషకాలతో కూడిన సమతుల ఆహారం
మనం తీసుకొనే ఆహారంలో విటమిన్ ఏ,బీ,సీ, డీ, ఐరన్, సెలీనియం, జింక్ తగిన మోతాదులో ఉండాలి. వీటివల్ల బ్యాక్టీరియా, వైరల్ ఇన్ఫెక్షన్లతో పోరాడే సామర్థ్యం శరీరంలోని సూక్ష్మ పోషకాలకు వస్తుంది. అంతేకాకుండా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. లేదంటే శరీరంలోకి చేరే హానికర బ్యాక్టీరియా, వైరస్‌లతో పోరాడే సామర్థ్యం తగ్గిపోతుంది. రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు పౌష్టికాహారం తీసుకోవడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.
వీటిని తీసుకోకూడదు
శీతల పానీయాలు, జంక్‌ఫుడ్, ఫాస్ట్‌ఫుడ్ వంటి వంటి వాటికి దూరంగా ఉండాలి. వీటిని తీసుకోవడం వల్ల రోగకారక క్రిములు శ్వాసకోశ వ్యవస్థపై ప్రభావం చూపుతాయి. స్వీయ నిర్బంధంలో ఉన్నప్పుడు ధూమపానం, మధ్యపానం, పొగాకు వంటి వాటికి దూరంగా ఉండాలి.
సమయానుసారం భోజనం తీసుకోవాలి
ఆహారాన్ని సమయానికి తీసుకోవడం చాలా ముఖ్యం. ఈ విషయంలో నిర్లక్ష్యం చేయడం తగదు. చాలామంది సమయానికి తినడం మానేస్తుంటారు. ఈ సమయంలో తీసుకునే ఆహారమే వైరస్ బారినుంచి రక్షిస్తుంది. తప్పనిసరిగా భోజనానికి కచ్చితమైన సమయాలను పాటించాలి. యోగా, ధ్యానం, వ్యాయామం వంటివి మనసుకు ప్రశాంతతను ఇస్తాయి. శ్వాస తీసుకునేందుకు వ్యాయామం చేయడం మంచిదని సూచిస్తున్నారు నిపుణురాలు.
వీటిలో పుష్కలంగా విటమిన్లు
విటమిన్ ఏ
విటమిన్ ఏ రోగనిరోధక శక్తిని పెంచుకుంది. ఇది గుడ్లులోని పచ్చసొన, బాదం, పిస్తా, తృణధాన్యాలు, ఆకుకూరగాయలు, క్యారెట్లో పుష్కలంగా లభిస్తుంది.
విటమిన్ బీ
విటమిన్ బీ, బీ6, బీ9, బీ12 హానికర బ్యాక్టీరియాలో పోరాడి ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుతాయి. ఇవి మాంసం, గుడ్లు, చేపలు, మటన్, బాదం, వేరుశెనగలు, బీన్స్, పాలలో లభిస్తాయి.
విటమిన్ సీ
శరీరంలో టాక్సిన్ పెరగడాన్ని నివారించడం, కణాలను శుభ్రపరచడం, రోగనిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది నిమ్మకాయలు, చెర్రీ, కివీ, టమాటాల్లో అధికంగా లభిస్తుంది.
విటమిన్ ఈ
సెల్యులార్ పెరుగుదలకు సహాయపడుతుంది. పిస్తా, వేరుశెనగలు, కూరగాయలల్లో లభిస్తుంది.
విటమిన్ డీ
శ్వాసకోశ సంబంధిత ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది. ఇది సూర్యరశ్మి, చేపలు, గుడ్లు, పాలలో ఉంటుంది.
జింక్
రోగనిరోధక వ్యవస్థకు సహాయపడే ఎంజైమ్‌లకు శక్తి నిస్తుంది. ఇదో యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. వైరల్ ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తుంది. చేపలు, గింజలు , మాంసంలో లభిస్తుంది.
ఏఏ సమయాల్లో ఏ ఆహారం తీసుకోవాలి?
అల్పాహారంలో..
ఉదయం ఇడ్లీ, దోసె, తృణధాన్యాలతో చేసిన ఉప్మా, 50 నుంచి 80 గ్రాముల గింజలతో పాటు ఓ గ్లాసు పాలు తీసుకోవాలి.
మధ్యాహ్న భోజనానికి ముందు
అల్పాహారం చేసిన తర్వాత మధ్యాహ్న భోజనానికి మధ్య సమయంలో మజ్జగ, నిమ్మరసం, పళ్లరసాలు, పండ్లు తీసుకోవడం మంచిది.
మధ్యాహ్నం భోజనానికి..
మధ్యాహ్న భోజనంలో 200 గ్రాముల బ్రౌన్ రైస్, 200 గ్రాముల కూరగాయలు, పప్పు, 100 గ్రాముల చికెన్, పెరుగు కచ్చితంగా తీసుకోవాలి.
సాయంత్రం 3 గంటలకు
సాయంత్రం 3 గంటల సమయంలో టీ లేదా కాఫీతో పాటు ఏవైనా చిరుతిళ్లు తినొచ్చు.
రాత్రి భోజనానికి
రాత్రి భోజనం 8:30కు ముగించేయాలి. ఇందుకు చపాతి, జొన్నరొట్టి, ఏదైనా కూర, పెరుగు తీసుకోవాలి. పడుకునే ముందు పసుపు కలిపిన పాలు తాగడం శ్రేయస్కరం.
ఇదీ చదవండి: 'పత్రికల నిరంతర సరఫరా దేశానికి అత్యవసరం'