పీజీ ప్రవేశాల్లో ప్రభుత్వ వైద్యులకు రిజర్వేషన్లకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. దేశంలోని మారుమూల ప్రాంతాల్లో సేవలందించే ప్రభుత్వ వైద్యులకు రిజర్వేషన్లు కల్పించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని స్పష్టం చేసింది.
వైద్యులకు రిజర్వేషన్ల కోసం శాసనం ద్వారా ప్రత్యేక నిబంధనలు తీసుకొచ్చే వీలు రాష్ట్రాలకు ఉందని జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం పేర్కొంది. రిజర్వేషన్లను అడ్డుకునే హక్కు భారత వైద్య మండలి(ఎంసీఐ)కి లేదని తేల్చి చెప్పింది.
గ్రామీణ ప్రాంతాల ఆస్పత్రుల్లో సేవలందించే వైద్యులకు రిజర్వేషన్లు కల్పిస్తే మరింత ప్రోత్సాహకరంగా ఉంటుందని తమిళనాడు మెడికల్ ఆఫీసర్స్ అసోసియేషన్ దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు.. ఈమేరకు తీర్పునిచ్చింది.