దేశవ్యాప్తంగా కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పరంధాముని దేవాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి.
చిన్నారులు కృష్ణుని వేషం ధరించి... చిన్ని కృష్ణయ్యను తలపిస్తున్నారు. మహిళలు దాండియా ఆడుతూ సందడి చేస్తున్నారు. యువకులు ఉట్ల పండుగకు సన్నద్ధమవుతున్నారు. చిన్నాపెద్దా తేడా లేకుండా అందరూ ఆ నవనీత చోరుని ఆరాధనలో తరిస్తున్నారు.
తమిళనాడు మధురైలో కృష్ణయ్య ఆలయాలు భక్తులతో కోలాహలంగా మారాయి. భక్తులు దేవదేవుణ్ని ధూపదీప నైవేద్యాలతో ఆరాధిస్తున్నారు. కర్ణాటక బెంగళూరులోని ఇస్కాన్ ఆలయంలో వైభవోపేతంగా కృష్ణారాధన జరుగుతోంది.
నేపాల్లోనూ కృష్ణలీలలు
నేపాల్ లలిత్పురలోని కృష్ణ మందిరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు దేదీప్యమానంగా జరుగుతున్నాయి.
కృష్ణ జయంతి
విష్ణుమూర్తి దశావతారాల్లో ఎనిమిదోది కృష్ణావతారం. దేవకీమాత గర్భం నుంచి ఆయన జన్మించిన తిథి అష్టమి. అదే కృష్ణాష్టమి. కృష్ణావతారంలో ఆయన దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ గావించాడు. రేపల్లె గోపాలుడు రాసకేళితో గోపికల జన్మ చరితార్థం చేశాడు. భగవద్గీత ద్వారా జనులకు జ్ఞానామృతాన్ని ధారబోశాడు.
ఇదీ చూడండి: చదరంగం ఆటతో వరద బాధితులకు సాయం