కేరళ తిరువనంతపురంలోని శ్రీ చిత్ర తిరునాళ్ ఇనిస్టిట్యూట్ ఫర్ మెడికల్ టెక్నాలజీ (ఎస్సీటీఐఎంటీ) అభివృద్ధి చేసిన 'చిత్ర మాగ్నా' కిట్‌కు... డ్రగ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా నుంచి అనుమతి లభించింది. ఫలితంగా కొవిడ్-19 వ్యాధిని నిర్ధరణ చేసే ఆర్ఎన్ఏ కిట్‌ను... పారిశ్రామిక స్థాయిలో అభివృద్ధి చేయడానికి ఆ సంస్థ సిద్ధమైంది.
కచ్చితమైన ఫలితం!
చిత్ర మాగ్నా.. 'మ్యాగ్నటిక్ బీడ్ బేస్డ్ ఆర్ఎన్ఏ ఐసోలేషన్' సాంకేతికత ఆధారంగా పని చేస్తుందని.. ఇది వేగవంతమైన, కచ్చితమైన ఫలితాలు ఇస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
7 రెట్లు అధికంగా..
ఎస్సీటీఐఎంటీ శాస్త్రవేత్తల ప్రకారం, సాధారణ వైరస్ టెస్టింగ్ కిట్ కన్నా ఈ 'చిత్ర మాగ్నా' పరికరం.. కరోనా అనుమానితుడి నుంచి 7 రెట్లు అధికంగా ఆర్‌ఎన్‌ఏను సేకరిస్తుంది. ఫలితంగా బాధితుడి గొంతు లేదా ముక్కు నుంచి తీసుకున్న సాంపిల్ ద్వారా.. అందులో సార్స్-కొవ్ 2 ఆర్ఎన్ఏ ఉందో లేదో వేగంగా నిర్ధరించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.
అప్పుడప్పుడూ పరీక్షల కోసం తీసుకున్న నమూనా.. ల్యాబ్‌కు తీసుకువెళ్లేటప్పుడు ఆర్ఎన్ఏ (రైబో న్యూక్లిక్ యాసిడ్) రెండు భాగాలుగా విడిపోవచ్చు. అయితే ఈ చిత్ర మాగ్నా కిట్‌లోని సాంకేతికత విడిపోయిన ఆర్‌ఎన్‌ఏను కూడా సేకరించి పరీక్షించగలదు.
ప్రత్యేక పద్ధతిలో..
పాలిమరైజ్ చైన్ రియాక్షన్ (పీసీఆర్) లేదా లూప్ మీడియోటెడ్ ఐసోథర్మల్ యాంప్లిఫికేషన్ (ఎల్ఏఎంపీ) పద్ధతి ఉపయోగించి.. ఆర్‌ఎన్‌ఏను డీఎన్‌ఏ (డియాక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్ )గా మార్చుతారు. ఆ తర్వాత ఏయే ప్రాంతల్లో వైరస్ డీఎన్‌ఏ ఉందో 'చిత్ర మాగ్నా' గుర్తిస్తుంది. దీని ఆధారంగా ఆ వ్యక్తికి కరోనా సోకిందో లేదో నిర్ధరిస్తారు.
ఇదీ చూడండి: టీబీ డయాగ్నోస్టిక్ యంత్రాలతో కరోనా పరీక్షలు