కరోనా పరీక్షలో కచ్చితత్వం సహా వేగంగా ఫలితాలు రాబట్టే పరికరాన్ని తయారు చేయడానికి పలు సంస్థలు పోటీ పడుతున్నాయి. వైరస్‌ను గుర్తించే పరికరాన్ని.. కేరళ తిరువనంతపురంలోని శ్రీ చిత్ర తిరునాళ్ ఇనిస్టిట్యూట్ ఫర్ మెడికల్ టెక్నాలజీ (ఎస్సీటీఐఎంటీ) అభివృద్ధి చేసింది.
ఈ పరికరానికి 'చిత్ర మాగ్నా' అని నామకరణం చేశారు. 'మ్యాగ్నటిక్ బీడ్ బేస్డ్ ఆర్ఎన్ఏ ఐసోలేషన్' సాంకేతికత ఆధారంగా ఈ పరికరం పని చేస్తుందని పరిశోధకులు తెలిపారు. ఇది వేగవంతమైన, కచ్చితమైన ఫలితాలు ఇస్తుందన్నారు.
7 రెట్లు అధికంగా..
సాధారణ వైరస్ టెస్టింగ్ కిట్ కన్నా ఈ 'చిత్ర మాగ్నా' పరికరం.. కొవిడ్-19 అనుమానితుడి నుంచి 7 రెట్లు అధికంగా ఆర్‌ఎన్‌ఏను సేకరిస్తుందని వెల్లడించారు పరిశోధకులు.
సాధారణంగా పరీక్షల కోసం తీసుకున్న నమూనా ల్యాబ్‌కు తీసుకువెళ్లేటప్పుడు, రవాణాలో ఆర్ఎన్ఏ రెండు భాగాలుగా విడిపోవచ్చు. అయితే ఈ కిట్ సాంకేతికత విడిపోయిన ఆర్‌ఎన్‌ఏను కూడా సేకరిస్తుంది.
బాధితుడి గొంతు లేదా ముక్కు నుంచి తీసుకున్న సాంపిల్ ద్వారా అందులో సార్స్-కొవ్ 2 ఆర్ఎన్ఏ ఉందో లేదో నిర్ధరించవచ్చని పరిశోధకులు తెలిపారు.
ప్రత్యేక పద్ధతిలో..
ఆర్‌ఎన్‌ఏను... పోలీమరైజ్ చైన్ రియాక్షన్ (పీసీఆర్) లేదా లూప్ మీడియోటెడ్ ఐసోథర్మల్ ఎంప్లిఫికేషన్(ఎల్ఏఎంపీ) పద్ధతిలో డీఎన్‌ఏగా మార్చుతారు. ఏయే ప్రాంతల్లో వైరస్ డీఎన్ఏ ఉందో ఈ 'చిత్ర మాగ్నా' గుర్తిస్తుంది. దీని ఆధారంగా ఆ వ్యక్తికి కరోనా సోకిందో లేదో నిర్ధరిస్తారు.
అనుమతి కోసం..
డాక్టర్ అనూప్ తెక్కువీటిల్ ఆధ్వర్యంలోని పరిశోధన బృందం ఈ చిత్ర మాగ్నాను అభివృద్ధి చేసింది. అయితే భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్), డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతి కోసం ఎదురుచూస్తుంది. అనుమతి లభిస్తే చిత్ర మాగ్నాను పరికరాలను మరింత ఉత్పత్తి చేస్తామని తెలిపారు.
ఇదీ చూడండి: 'కరోనాపై పోరులో భారత విధానాలు భేష్'