భారత అమ్ములపొదిలో త్వరలో అత్యంత శక్తిమంతమైన బాంబులు చేరనున్నాయి. బాలాకోట్ వైమానిక దాడిలో వాడిన 'స్పైస్-2000' శ్రేణిలోని ఈ బాంబులు భవంతులను కూడా సునాయాసంగా నేలమట్టం చేయగలవు. ఈ బాంబులను ఇజ్రాయెల్ నుంచి దిగుమతి చేసుకుంటోంది భారత్.
సెప్టెంబర్‌లో...
ప్రభుత్వ ఆదేశానుసారం సుమారు వందకు పైబడి స్సైస్-2000 బాంబులను తక్షణం సమకూర్చుకోవాల్సిందిగా గత జూన్‌లో భారత వైమానిక దళం ఇజ్రాయెల్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం సెప్టెంబరు రెండోవారం నాటికి ఈ బాంబులు భారత వైమానిక దళానికి అందుతాయని విశ్వసనీయ వర్గాల సమాచారం.
యుద్ధ విమానాల ద్వారా జార విడిచే స్పైస్-2000 బాంబులు భారత్‌కు చేరితే గగనతల శక్తి సామర్థ్యాలు మరింత పెరిగినట్లేనని అధికారులు అభిప్రాయపడ్డారు. వీటితోపాటు వార్ హెడ్లు కూడా భారత్‌కు రానున్నాయి.
బాలాకోట్‌లో..
బాలాకోట్‌లోని ఉగ్ర స్థావరాలపై ఈ బాంబులతోనే భారత్ దాడులు చేసింది. 12 మిరాజ్ యుద్ధ విమానాలు నియంత్రణ రేఖ దాటి వెళ్లి జైషే మహ్మద్ ఉగ్ర స్థావరాలపై స్పైస్-2000 బాంబులను జార విడిచాయి. ఎక్కువ బరువు వల్ల ఈ బాంబులు భవనం కాంక్రీటు పైకప్పును చీల్చుకొని లోపలికి చేరగలవు. అందులోని 70-80 కిలోల మందుగుండు సామగ్రి వల్ల భారీ పేలుడు సృష్టించగలవు.