విదేశాంగ విధానాలకు సంబంధించి ఒక్కో ప్రధాన మంత్రిది ఒక్కో శైలి. అంతర్జాతీయంగా సంక్షోభ పరిస్థితులు నెలకొన్నప్పుడు భారత ప్రధాని పాత్ర మరింత కీలకమవుతుంది. అయితే గతానికంటే భిన్నంగా భారత విదేశాంగ విధానానికి సరికొత్త నిర్వచనం చెప్పిన ప్రధాని పీవీ. తనదైన దౌత్యనీతితో పాత మిత్రులను దగ్గర చేసుకొని.. కొత్త వారికి స్నేహ హస్తాన్ని చాచి.. తన మార్క్‌ను చాటుకున్నారు.
లుక్ ఈస్ట్ పాలసీకి శ్రీకారం
పీవీ రాక ముందు భారత్ దృష్టి అంతా పశ్చిమ దేశాలతో సంబంధ బాంధవ్యాలపైనే ఉండేది. కానీ, ఆయన వచ్చాక అమెరికాతో సన్నిహిత సంబంధాలు నెలకొల్పడమే కాకుండా లుక్ ఈస్ట్ పాలసీ వంటి నూతన విధానాలకు శ్రీకారం చుట్టారు. సుదీర్ఘ కాలం గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసిన తూర్పు ఆసియా దేశాలతో వ్యాపారం, వాణిజ్య ఒప్పందాల కోసం బాటలు పరిచారు. ఆసియాలో భారత్ బలపడాలన్న లక్ష్యంతో బంగ్లాదేశ్, మయన్మార్, థాయ్‌లాండ్‌తో సహా అసోసియేషన్ ఆఫ్ సౌత్‌ఈస్ట్ ఏషియన్ నేషన్స్ (ఏఎస్ఈఏఎన్) సభ్యులకు స్నేహహస్తం అందించారు. సార్క్ దేశాలు దక్షిణ ఆసియా ఫ్రీ ట్రేడ్ ఏరియా ( ఎస్ఏఎఫ్టీఏ)ను ఏర్పాటు చేయటంలో పీవీ కీలక పాత్ర పోషించారు.
ఇండో-ఇజ్రాయెల్ భాగస్వామ్యం బలోపేతం..
తన పదవీకాలంలో ఇండో-ఇజ్రాయెల్ భాగస్వామ్యం కోసం కృషి చేశారు పీవీ. ఆయన అధికారంలోకి వచ్చే వరకు భారత్‌లో ఇజ్రాయెల్ దౌత్య కార్యాలయమే లేదు. 1992లో ఆ దేశం దిల్లీలో దౌత్యకార్యాలయం ఏర్పాటు చేసుకునేలా చొరవ చూపారు. ఈ ఇరు దేశాల బంధం క్రమంగా బలోపేతమైంది. కార్గిల్ యుద్ధ సమయంలో ఇజ్రాయెల్ భారత్‌కు ఆయుధాలు సరఫరా చేసింది. భారత్-పాలస్తీనా సంబంధాలు కూడా సానుకూలంగానే సాగాయి. ఇక ఇరాన్‌తోనూ అదే స్థాయిలో మైత్రి ఏర్పరుచుకున్నారు.
అణు పరీక్షలకు ఆద్యులు..
భారత్‌లో అణు పరీక్షలకు ఆద్యుడు పీవీనే. అణు పరీక్షలు నిర్వహించేందుకు ప్రత్యేక చొరవ చూపించి భారత్ బలమైన శక్తిగా ఎదుగుతోందని అగ్రరాజ్యాలకు సంకేతాలు పంపారు. 1996లో సార్వత్రిక ఎన్నికల ముందు అణుబాంబు తయారు చేయాలని డాక్టర్ అబ్దుల్ కలామ్‌ను ఆదేశించారు. ఆ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌కు ప్రతికూలంగా వచ్చినా 1998లో వాజ్‌పేయీ హయాంలో అణు పరీక్షలు నిర్వహించటానికి పీవీ ఆలోచనే ముఖ్య కారణమైంది.
అమెరికా, రష్యాతో సంబంధాలు
1990ల నాటికి సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైన తర్వాత భారత్‌కు రష్యా క్రమంగా దూరమవుతూ వచ్చింది.
పీవీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక 1993లో రష్యా అధ్యక్షుడు బోరిస్ ఎల్సిన్‌ను భారత్‌కు ఆహ్వానించారు. చర్చలు జరిపి మళ్లీ మైత్రి కుదిరేలా చొరవ చూపారు. ఈ విదేశాంగ విధాన వ్యూహకర్త. పశ్చిమ దేశాలతో సన్నిహితంగా ఉంటూనే.. రష్యాతో మంచి సంబంధాలు కొనసాగించారు. ఇదే క్రమంలో అమెరికాకూ దగ్గరయ్యారు. అమెరికాలో పర్యటించి అప్పటి అధ్యక్షుడు బిల్ క్లింటన్‌కు స్నేహ హస్తం చాచారు. కశ్మీర్ అంశం ద్వైపాక్షిక సమస్యేనన్న భారత్ వాదనలోని హేతుబద్ధతను అమెరికా గుర్తించింది. అంతే కాదు.. రాకెట్ల తయారీకి ఉపయోగపడే సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేందుకు సహకరించింది.
పాక్‌పై వాజ్‌పేయీ అస్త్రం
విధానపరమైన నిర్ణయాల్లో పీవీ ఆలోచనలు ప్రత్యేకంగా ఉంటాయి. దేశ ప్రతిష్ఠకు సంబంధించిన అంశాల్లో ఆయన పార్టీలకు అతీతంగా ఆలోచిస్తారు. జెనీవా నగరంలో 1994లో జరిగిన ఐక్యరాజ్య సమితి మానవహక్కుల కమిషన్ ప్రత్యేక సదస్సులో భారత ప్రతినిధిగా అప్పటి ప్రతిపక్ష నేత వాజ్‌పేయీని పంపడమే ఇందుకు నిదర్శనం. కశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయంటూ సదస్సులో భారత్‌ను ఇబ్బంది పెట్టాలని తీవ్రంగా ప్రయత్నించింది పాకిస్థాన్. పాక్ ఆరోపణలను వాజ్‌పేయీ నేతృత్వంలోని బృందం సమర్థంగా తిప్పికొట్టింది. ఫలితంగా.. ఆ దేశంపై భారత్ దౌత్య విజయం సాధించింది. ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటిన పీవీ చర్యను చాలా మంది అభినందించారు.
ఐరోపా దేశాలతోనూ మైత్రి బంధం..
పీవీ ప్రధాని అయ్యాక ఐరోపా దేశాలతోనూ మైత్రి బంధం బలపరిచారు. జర్మనీలో తొలిసారి పర్యటించి భారత్‌కు ఆ దేశంతో కలిగే ప్రయోజనాలు అంచనా వేసి స్నేహం కొనసాగించారు. పెట్టుబడులు, సాంకేతికత విషయంలో జర్మనీ.. భారత్‌కు సహకరించింది. చైనాతోనూ సత్సంబంధాలు నెరిపేందుకు చాలా కృషి చేశారు పీవీ. 1993లో తొలిసారి భారత్, చైనా మధ్య పీస్ అండ్ ట్రాంక్విలిటీ పేరిట శాంతి ఒప్పందం కుదరటానికి కారణం ఆయనే. ఇక అదే ఏడాది మార్చిలో పాకిస్థాన్ ప్రోద్బలంతో బాంబే పేలుళ్ల ఘటన జరిగిన తరవాత పీవీ వ్యవహరించిన తీరు అన్ని దేశాల ప్రశంసలు అందుకుంది.