ఈయన భాగల్‌పుర్‌కు చెందిన యువ శాస్త్రవేత్త గోపాల్జీ. ప్రస్తుతం ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్‌లో పరిశోధన చేస్తున్నాడు. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాలో చేరమంటూ ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పంపిన ఆహ్వానాన్ని తిరస్కరించాడు గోపాల్. తన దేశానికి సేవ చేయాలన్న గొప్ప సంకల్పమే అందుకు కారణం.
"నేను నిరాకరించలేదు, తిరస్కరించాను. మా దేశానికి వచ్చి పరిశోధన చేస్తే.. అన్ని సదుపాయాలు కల్పిస్తామని ఆహ్వానించారు. కొన్ని రోజులు ఆలోచించాను. నాకైతే మనదేశంలో అన్ని సౌకర్యాలు ఉన్నప్పుడు అక్కడికి ఎందుకు వెళ్లాలనిపించింది."
- గోపాల్జీ, యువ శాస్త్రవేత్త
ఏడో తరగతి నుంచే..
భాగల్పుర్లోని ధృవగంజ్.. గోపాల్ సొంత గ్రామం. పాఠశాల రోజుల్లోనే అరటి బోదె నుంచి విద్యుత్ తయారు చేసి, బల్బులు వెలిగించి ఆ ఊరివాళ్లను ఆశ్చర్యంలో ముంచెత్తాడు గోపాల్.
"కొన్నిసార్లు ఇంట్లోనే విద్యుత్ తయారు చేసేవాడు. ఎప్పుడూ ఏదో ఒకపని చేస్తుండేవాడు. ఓసారి పొలానికి వెళ్తే వాళ్ల నాన్న బట్టల మీద మరకలు చూసి.. అవేంటని అడిగాడు. అరటి బోదె మరకలు అని చెప్పగా.. దానిలో ఉండే యాసిడ్ వల్ల మరక పడిందని వివరించాడు. అయితే.. అరటి బోదెతో ఏదైనా చేద్దామనే ఉద్దేశంతో ఓ యంత్రం కొన్నాడు. ఏడో తరగతిలోనే, ఆ మరకలు తొలగించేందుకు పరిశోధన చేశాడు. ఆ తర్వాతే విద్యుత్‌తో బల్బు వెలిగించాడు."
- ఉషాదేవి, గోపాల్జీ తల్లి
నాసా ఆహ్వానాన్ని కాదని..
పరిశోధనా పత్రాలు సమర్పించిన ఈ యువ శాస్త్రవేత్త.. రెండింటికి పేటెంట్ హక్కులు కూడా పొందాడు. సూర్యుడి ఉష్ణోగ్రత కొలిచే గోపోనియం అల్లాయ్పై పరిశోధన చేశాడు. తన పరిశోధన తీరు మెచ్చి.. గోపాల్‌ను ఆహ్వానించింది నాసా. ఆ ఆహ్వానాన్ని తిరస్కరించిన గోపాల్.. ప్రస్తుతం అరటిలోని నానో క్రిస్టల్, నానో ఫైబర్లపై పరిశోధన చేస్తున్నాడు.
"ప్రస్తుతం బీఎన్సీ... బనానా నానో క్రిస్టల్, బనానా నానో ఫైబర్పై పరిశోధన చేస్తున్నాం. అరటిలోని వివిధ భాగాలను పరిశీలిస్తున్నాను."
- గోపాల్జీ, యువ శాస్త్రవేత్త
పరిశోధన రంగంలో గోపాల్ సాధిస్తున్న ప్రగతిని చూసి.. ఆయన కుటుంబసభ్యులు గర్వపడుతున్నారు.
"మన దేశం కోసం, ట్రంప్ లాంటి అధినేత పంపిన ఆహ్వానాన్ని తిరస్కరించేంత స్థాయికి మా ఇంటి అబ్బాయి ఎదగడం గర్వంగా ఉంది. దేశం కోసం ఏదో ఒకటి చేస్తాడని నమ్ముతున్నాం."
- మనోరంజన్ కుమార్, గోపాల్జీ బాబాయి
ఇంతటి గొప్ప స్థానానికి చేరుకోవడం వెనక గోపాల్ పడిన శ్రమ, ఎదుర్కున్న సవాళ్ల గురించి.. ఆయన మాటల్లోనే విందాం.
దేశ సేవే లక్ష్యంగా..
"మధ్యతరగతి కుటుంబం మాది. ఎన్నో కష్టాలుపడ్డాం. బిహార్‌లోని భాగల్పుర్ జిల్లాలోని ధృవగంజ్ అనే చిన్న గ్రామం మాది. నాన్న అరటి రైతు. మా కుటుంబానికి అరటి తోటే ఆధారం. ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచో ఆఫర్లు వస్తున్నాయి. ఎన్నో దేశాలు నా వ్యాసాలు ప్రచురించాయి. అమెరికా, చైనా, జపాన్ లాంటి దేశాలు చాలాసార్లు ఆహ్వానం పంపాయి. ప్రయోగశాల, ఉపకారవేతనం లాంటి అన్ని సదుపాయాలూ కల్పిస్తామని దేశంలో ఉన్న 120 విశ్వవిద్యాలయాలు చెప్పాయి. అపరిశుభ్రంగా ఉన్న మన ఇంటిని అలాగే వదిలేసి వెళ్తామా? శుభ్రం చేసిన తర్వాతే కదా వెళ్తాం. మనదేశంలో పరిశోధన ఇంకా అంత స్థాయికి చేరలేదు. ఆ స్థాయిలోని శాస్త్రవేత్తల గురించి ఇంకా జనాలకు తెలియదు. 100 మందికో 150 మందికో సాయం చేయడం నా ఉద్దేశం కాదు."
- గోపాల్జీ, యువశాస్త్రవేత్త
ఈ యువకెరటం.. అపార ప్రతిభ, చిత్తశుద్ధితో కష్టపడి, దేశానికి సేవ చేయాలన్న దృఢ సంకల్పంతో ప్రపంచస్థాయిలో ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. బిహార్‌కే కీర్తి తెచ్చాడు.
ఇదీ చదవండి: ఆయన జీవితం భూమికే అంకితం