ఈయన ఓ డాక్టరు. అందరిలాంటి సాధారణ వైద్యుడు మాత్రం కాదు. తన వద్దకొచ్చే రోగులు ఆయన్నో దేవుడిలా భావిస్తారు. దక్షిణ భారతదేశానికి చెందిన ఈ క్యాన్సర్ స్పెషలిస్టు.. 2007లో అసోంకు వచ్చారు. ఆయనే డాక్టర్ రవి కన్నన్.
కుటుంబ సభ్యులు భయపడినా..
అసోంకు వచ్చిన తర్వాత సిల్చార్లోని మెహెర్పూర్లో ఉన్న కచార్ క్యాన్సర్ ఆసుపత్రిలో కన్నన్ వైద్యసేవలు ప్రారంభించారు. చెన్నైలో పనిచేసే సమయంలోనే ఈ ఆసుపత్రి గురించి గొప్పగా విన్న కన్నన్.. వారు పంపిన ఆహ్వానం వెంటనే అంగీకరించారు. అసోంలో ఉగ్రవాదం, వరదల్లాంటి సమస్యలుంటాయని కుటుంబ సభ్యులు భయపడినట్లు ఆయన చెబుతున్నారు.
"గతంలో చెన్నైలో పనిచేసేవాణ్ని. 2007లో ఇక్కడికొచ్చాను. ఆ సమయంలో కచార్లో క్యాన్సర్ చికిత్స సదుపాయం ఉండేది కాదు. గువాహటిలోని డాక్టర్ బీ బారు వా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఒక్కటే చికిత్స చేసేది. సిల్చర్ నుంచి గువాహటికి వెళ్లడమంటే చాలా కష్టంగా ఉండేది."
- డాక్టర్ రవి కన్నన్
70వేల మందికిపైగా ఉచిత వైద్యం
కుటుంబసభ్యులు వద్దని వారించినా వినకుండా అసోంకు వచ్చారు డాక్టర్ కన్నన్. ఇప్పటి వరకు 70 వేలమందికి పైగా ఉచిత చికిత్స అందించారు. ఎంతోమందికి పునర్జన్మ ప్రసాదించిన కన్నన్.. ప్రాణాంతక క్యాన్సర్ బారిన పడిన రోగుల్లో బతకాలన్న ధైర్యం నూరిపోస్తూ వారి జీవితాల్లో కొత్తవెలుగులు నింపుతున్నారు.
"బారక్ లోయలోని ప్రజలంతా ఓ సంఘంగా ఏర్పడి, ఆసుపత్రి నిర్మించుకున్నారు. సామాన్యులు ఇలాంటి ఓ పెద్ద సంస్థనే నిర్మించిన సంఘటనలు ప్రపంచవ్యాప్తంగా వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. మొదట్లో మేం 23 మంది ఉండేవాళ్లం. 20 పడకలుండేవి. మా సంఖ్య క్రమంగా పెరిగి.. ప్రస్తుతం 150 మంది పనిచేస్తున్నాం. మాదో అద్భుతమైన బృందం. ఒక్కడే ఏమీ చేయలేడు. వైద్యులు, నర్సులు, సాంకేతిక, పారిశుద్ధ్య సిబ్బంది... ఇలా అందరి సమష్టి కృషి ఫలితం ఇది. ప్రతి ఒక్కరి కష్టం విలువైనదే."
- డాక్టర్ రవి కన్నన్
చికిత్స అనంతరమూ రోగి యోగక్షేమాలపై దృష్టి
చికిత్సకు అయ్యే ఖర్చులో రాయితీ ఇవ్వడం సహా.. చికిత్స తర్వాత కూడా రోగి క్షేమ సమాచారం తెలుసుకుంటుంది ఈ ఆసుపత్రి. ఏ రోగీ చెకప్ తేదీలు మర్చిపోకుండా ఉండేందుకు ఆరోగ్య కార్యకర్తలు, సహాయక సిబ్బంది ఎప్పటికప్పుడు వారితో మాట్లాడుతూనే ఉంటారు.
ఇదీ చదవండి: పేదరికంలో కూరుకుపోయిన 135 కోట్ల మంది బాలలు!