సాధించి తీరాలన్న తపన ఉన్నవారిని ఏ అవరోధమూ అడ్డుకోలేదు. పవర్ లిఫ్టింగ్‌లో వరుసగా నాలుగు సార్లు జాతీయస్థాయి పోటీల్లో స్వర్ణం గెలుచుకున్న రాంచీకి చెందిన లక్ష్మిశర్మకు ఈ మాటలు సరిగ్గా సరిపోతాయి. సాధారణంగా మహిళలు కుటుంబ బాధ్యతలతో సతమతమయ్యే 36 ఏళ్ల వయసులోనూ లక్ష్మి ఈ ఘనత సాధించింది. నాలుగేళ్ల క్రితం తుంటినొప్పి బారిన పడింది లక్ష్మి. ఆమె జీవితం మలుపు తిరిగింది అక్కడే. కుమారుడి సలహా, ఝార్ఖండ్‌లోనే దిగ్గజ పవర్ లిఫ్టర్ సజాత భగత్ సాయంతో తన ఆశయానికి తిరిగి రెక్కలు తెచ్చుకోగలిగింది.
"కాలిలో సయాటికా వల్ల నిస్సహాయురాలిగా ఉండిపోయాను. కనీసం కూర్చోలేకపోయాను. రెండేళ్లు చికిత్స తీసుకున్నా నొప్పి ఏమాత్రం తగ్గలేదు. జిమ్‌లో చేరమని నా కుమారుడు ఇచ్చిన సలహాతో పవర్‌లిఫ్టర్ సుజాతను కలిశాను. ఆమే నన్ను ప్రోత్సహించింది. మెల్లగా నా సాధన కొనసాగించాను."
--లక్ష్మి శర్మ, పవర్‌లిఫ్టర్.
పిల్లల సాయంతో..
మార్వాడీ బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చిన లక్ష్మి పవర్‌లిఫ్టింగ్‌లో ప్రవేశించేందుకు చాలా కష్టాలే పడింది. కోడలు గడప దాటి పవర్‌లిఫ్టింగ్ లాంటివి చేయడం అత్తింటివారికి ఎంతమాత్రం ఇష్టం లేదు. కుటుంబసభ్యుల తిరస్కారాన్ని పిల్లల సాయంతో అధిగమించి, స్థానిక టోర్నీల్లో గెలిచింది లక్ష్మి. తర్వాత వెనక్కితిరిగి చూడలేదు. 2017లో జాతీయస్థాయి పోటీల్లో స్వర్ణం సాధించి విమర్శలకు చెక్ పెట్టింది. వరుసగా 4స్వర్ణాలు గెలుచుకుని, జాతీయఛాంపియన్‌గా నిలిచింది.
"ఇప్పుడు నన్ను చూసి అందరూ గర్వపడుతున్నారు. మా నాన్న, నా భర్త సంతోషంగా ఉన్నారు. నాకూ అది సంతోషాన్నిస్తోంది. నా కుమార్తె ఆర్థికంగా సాయపడింది, అమ్మా నువ్వేదైనా చేయాలని నా కుమారుడు నన్ను మానసికంగా సిద్ధం చేశాడు. 5 జాతీయ పోటీల్లో నాలుగింటిలో స్వర్ణం గెలుచుకున్నా. అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేందుకు ప్రస్తుతం సాధన చేస్తున్నా. "
--లక్ష్మి శర్మ, పవర్‌లిఫ్టర్.
పవర్‌లిఫ్టింగ్ కోసం పడిన కష్టాలు తలచుకుని, కళ్లనీళ్లు పెట్టుకుంటోంది లక్ష్మి. చంద్రుడి పైకి వెళ్లినా, మహిళలపై సమాజం ఎప్పుడూ వివక్ష చూపుతుందంటోంది. కాస్త ఆలస్యమైనా ఎప్పటికి అయినా ఉన్నత శిఖరాలకు చేరుకుంటానని ధీమాగా ఉంది లక్ష్మి.
ఇదీ చూడండి: ఒకే వేదికపై ముగ్గురు కవల అక్కాచెల్లెళ్ల పెళ్లి