జమ్ముకశ్మీర్‌లో అభివృద్ధిని శరవేగంగా పట్టాలెక్కించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ ప్రక్రియలో భాగంగా 106కు పైగా కేంద్ర చట్టాలను రాష్ట్రంలో అమలు చేసేందుకు కసరత్తులు చేస్తోంది. ఇందుకు అవసరమైన మౌలిక వసతుల కల్పన, వివిధ పథకాల అమలుకు వందల కోట్ల రూపాయల ప్యాకేజీని త్వరలోనే ప్రకటించనుంది.
రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తిని రద్దు చేసిన కేంద్రం ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విడగొట్టింది. జమ్ముకశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతాలుగా మారే వరకూ కేంద్ర, రాష్ట్ర చట్టాలు అమల్లో ఉంటాయి. అక్టోబర్ 31 నుంచి పాలన పూర్తిగా కేంద్ర చట్టాల్లోకి మారుతుంది. ఇందుకు వీలుగా వందల కోట్ల రూపాయలతో కూడిన ప్రత్యేక ప్యాకేజీ రూపకల్పనలో కేంద్రం నిమగ్నమైందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
కార్మిక, విద్యుత్తు, పునరుత్పాదక ఇంధనం, మానవ వనరుల అభివృద్ధి తదితర శాఖలతో కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ గతవారం సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని ప్రాజెక్టులపై మదింపు జరిపారు. అక్కడ కేంద్ర చట్టాలను సమర్థంగా అమలు చేయటానికి అవసరమైన నిధులపై విశ్లేషణ జరిపారు. వివిధ మంత్రిత్వ శాఖలు అందించిన ప్రతిపాదనల ఆధారంగా నిర్దిష్టంగా ఎంత మొత్తం అవసరమన్నది ఇంకా గణించాల్సి ఉందని అధికార వర్గాలు తెలిపాయి.
కీలక ప్రతిపాదనలు
- జమ్ముకశ్మీర్‌లోని ఈఎస్ఐ చందాదారులకు ఆరోగ్య సేవలు అందించడానికి అక్కడ కొత్తగా ఒక ఆసుపత్రి నిర్మాణానికి కార్మిక శాఖ ప్రతిపాదన
- విద్యాహక్కు చట్టం అమలు చేయడానికి రూ.కోట్లు
- రాష్ట్రంలోని ప్రజలకు వివిధ రకాల ప్రయోజనాలు, రాయితీలను అందించడానికి వీలుగా ఆధార్ చట్టం-2016 అమలు
ఉన్నతాధికారుల సమీక్ష
జమ్ముకశ్మీర్ పునర్విభజన ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకున్న మార్గాలపై చర్చించేందుకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఎ.కె.భల్లా అధ్యక్షతన పలు శాఖలకు చెందిన ఉన్నతాధికారులు మంగళవారం దిల్లీలో సమావేశమయ్యారు. జమ్ముకశ్మీర్, లద్దాఖ్‌లో పర్యాటక రంగానికి ఊతమిచ్చేందుకు కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
వీటిని ఖరారు చేయటానికి కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రి ప్రహ్లాద్ పటేల్, అధికారులు వచ్చే నెలలో కశ్మీర్లో పర్యటించనున్నారు. పర్యాటకులకు మార్గనిర్దేశం చేసే గైడ్లకు శిక్షణ ఇస్తామని, వివిధ భాషలను వారికి పరిచయం చేస్తామని మంత్రి తెలిపారు.
ఇదీ చూడండి: హై అలర్ట్: భారత్‌పై దాడులకు పాక్ కుట్ర..!