2017లో విశ్వాసపరీక్ష సందర్భంగా పళనిస్వామి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసిన అధికార ఎమ్మెల్యేలపై స్పీకర్ చర్యలు ప్రారంభించారని సుప్రీం కోర్టుకు తెలిపింది తమిళనాడు ప్రభుత్వం. తగిన చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది.
ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి పన్నీరుసెల్వం సహా మరో 10 మంది 2017లో జరిగిన విశ్వాసపరీక్షలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయటంపై చర్యలు చేపట్టాలని సుప్రీం కోర్టును ఆశ్రయించింది డీఎంకే.
డీఎంకే పిటిషన్‌పై విచారణ చేపట్టిన భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం.. తమిళనాడు ప్రభుత్వ వివరణతో వాజ్యాన్ని కొట్టివేసింది.
ఇదీ జరిగింది..
2017లో పళనిస్వామి నేతృత్వంలో ఏర్పడిన ప్రభుత్వంపై విశ్వాసపరీక్ష నిర్వహించిన సందర్భంగా 11 మంది అధికార పార్టీ శాసనసభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. అందులో ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం ఉన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరించిన 11 మంది రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు పిటిషన్ దాఖలు చేసింది డీఎంకే. విశ్వాసపరీక్ష సమయంలో అధికార పార్టీ విప్‌ను ధిక్కరించారని పేర్కొంది. ఫిరాయింపుల నిరోధక చట్టం కింద వారిపై అనర్హత వేటు వేయాలని కోరింది.
అయితే.. తమ పిటిషన్‌పై ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని సుప్రీం కోర్టును ఆశ్రయించింది డీఎంకే.
ఇదీ చూడండి: 'అసలు మొత్తం తీసుకోండి.. నన్ను వదిలేయండి'